ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఈ మోసాలకు సామాన్యులే కాదూ ప్రముఖులు సైతం బలౌతున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో వారిని బురిడీ కొట్టించి.. ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మీరు లక్కీ డ్రా గెలిచారనో, మీ ఎటిఎం పనిచేసే కాలం అయిపోయిందనే, తాము బ్యాంకు అధికారులమనో, మరో కట్టు కథతోనో డబ్బును కొల్లగొడుతున్నారు. ఇలా కేవలం ఒక్క ఫోన్ కాల్ తో సబ్ రిజిస్ట్రార్ నుండి డబ్బులు నొక్కేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా చోడవరం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా ఆకెళ్ల సూర్య నర్సింహ మూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 27న విధుల్లో ఉన్న ఆయన మధ్యాహ్నం భోజనం చేస్తుండగా.. 9885050970 నంబరు నుండి ఫోన్ కాల్ వచ్చింది. తాము ఏసీబీ అధికారులమని, సర్వీసు వివరాలు చెప్పాలని సూచించారు. మీపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, లంచం తీసుకున్నట్లు, అక్రమ ఆస్తులు ఉన్నట్లు సమాచారం వచ్చిందని బెదిరించారు. ఈ ఆరోపణలు, కేసుల నుండి బయట పడాలంటే.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏసీబీ నుండి ఒక్కసారిగా ఫోన్ రావడంతో ఆందోళనకు గురైన ఆకెళ్ల సూర్య నర్సింహమూర్తి.. వారు చెప్పిన నంబర్ 7780438432కు రూ. 40 వేలను గూగుల్ పే ద్వారా చెల్లించారు. కొద్ది సేపటి తర్వాత.. సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. వారు ఆ నంబర్లను ట్రూ కాలర్ అనే యాప్ లో తనిఖీ చేశారు. దీంతో మోసపోయామని గుర్తించారు. మిగిలిన డబ్బుల కోసం అదే నంబర్ నుండి కాల్ రాగా, గట్టిగా మాట్లాడటంతో ఫోన్ కట్ చేశారు. ఈ విషయాన్నిసైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు నర్సింహమూర్తి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.