మీ పిల్లల్ని ఊయలలో వేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. చిన్నారుల విషయంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే.. చిన్న ఏమరుపాటు కూడా పెద్ద ప్రమాదానికి తావిస్తోందని చెప్పొచ్చు.
ఒక అభం శుభం తెలియని ఏడాదిన్నర చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అహరించారు. ఊయలలో నిద్రిస్తుండగా పాపను ఎత్తుకెళ్లారు. నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. గుర్రాలమడుగుకు చెందిన అనూష, రాపూరు వాసి మణికంఠకు నాలుగేళ్ల కింద పెళ్లైంది. ఈ దంపతులకు కృతిక, లక్ష్మీహారిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణికంఠ రాపూరులో ఒక హోటల్ నడుపుతున్నాడు. అనూష నెల్లూరులోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది.
మణికంఠ అప్పుడప్పుడూ నెల్లూరుకు వచ్చి భార్యా బిడ్డల్ని చూసి వెళ్తుంటారు. ఆదివారం అనూష తల్లి రాపూరులోని అల్లుడి ఇంటికి వెళ్లింది. దీంతో అనూష తన ఇద్దరు బిడ్డలతో ఇంటికి దగ్గర్లోనే ఉన్న పిన్ని ఇంట్లోకి నిద్రించేందుకు వెళ్లింది. చిన్న పాప లక్ష్మీ నిహారికను ఊయలలో వేసి.. పెద్దకుమార్తెతో కలసి అనూష మంచం మీద నిద్రపోయింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తల్లి నిద్రలేచి చూడగా.. పాప ఊయలలోనే నిద్రపోతూ కనిపించింది. ఆ తర్వాత కరెంటు పోవడం.. ఉక్కపోతగా ఉండటంతో గాలి కోసం తలుపులు తీసి నిద్రపోయారు.
తర్వాతి రోజు ఉదయం అనూష నిద్రలేచి ఊయలలో చూడగా పాప ఉండాల్సిన ప్లేసులో రెండు బొమ్మలు ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురైన అనూష.. బంధువులకు ఈ విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. పాప ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ విజయరావు ప్రత్యేక బృందాలతో చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఇది తెలిసినవారి పనేనా లేదా అపహరణకు పాల్పడింది దుండగులా అనే కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.