ఆవేశం ఎలాంటి దారుణాలకు పురిగొల్పుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కొన్ని సెకన్ల సమయం మనం సంయమనం పాటించి.. మనం విచక్షణతో ఆలోచిస్తే.. సమాజంలో ఇన్ని నేరాలు, దారుణాలు జరగవు. తల్లిదండ్రులకు కూడా గుండెకోత తప్పుతుంది. తాజాగా ఓ జంట క్షణికావేశంలో ఎంతటి దారుణానికి పాల్పడ్డారో చూడండి..
సాధారణంగా ప్రేమించుకున్నాం అంటే పెద్దలు అంగీకరించరు. పెళ్లికి ఒప్పుకోరు. దాంతో కొందరు ప్రేమికులు ధైర్యం చేసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు.. మరి కొందరేమో తల్లిదండ్రుల కోసం తమ ప్రేమను త్యాగం చేస్తారు.. ఇంకొందరు తమ ప్రాణాలనే బలి తీసుకుంటారు. సాధారణంగా ప్రేమికులు ఎదుర్కునే సమస్య.. పెద్దలు నిరాకరించడం. కానీ ఇప్పుడు మనం చూడబోయే లవర్స్ విషయంలో విలన్ ఎవరు లేరు. ప్రేమించుకున్నాం అంటే.. పెద్దలు కూడా సరే అన్నారు. పెళ్లికి అంగీకరించారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లితో ఒక్కటవ్వాల్సిన జంట.. శవాలై కనిపించారు. మరి వారి ప్రేమ కథలో విలన్ ఎవరు.. ఎందుకు వారు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకున్నారో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం, దొనబండలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరెడ్ల సిద్ధయ్య, వసంత దంపతుల చిన్న కుమార్తె సంఘవి డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలో సంఘవికి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగవెల్లి శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇక వీరి లవ్ మ్యాటర్ ఇంట్లో తెలియడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు ఆమోదం తెలిపి.. పెళ్లికి అంగీకరించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. అంత బాగుందనుకున్న సమయంలో.. వీరు తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం.. ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది.
ఆడో నడుపుతూ జీవినం సాగించే శ్రీకాంత్‌కు అప్పులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే ఆర్థిక కష్టాలు ఎక్కువ అవుతాయని భావించాడు. తనతో పాటు సంఘవి కూడా ఇబ్బండి పడాల్సి వస్తుందని.. దాని కంటే వివాహం రద్దు చేసుకోవడమే మేలు అనుకున్నాడు. తన నిర్ణయం గురించి సంఘవికి చెప్పడం కోసం శుక్రవారం ఆమెను కలిశాడు. ఇద్దరు ఎల్లంపల్లి జలాశయం వైపుకు ఆటోలో వెళ్లారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీకాంత్ అసలు విషయం చెప్పాడు. ఇప్పటికే అప్పులు కట్టలేకపోతున్నాని.. పెళ్లి చేసుకుంటే మరిన్ని ఖర్చులు పెరుగుతాయని.. అందుకే సంఘవిని పెళ్లి చేసుకోలేనని తెలిపాడు.
ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. ఈ సంఘటనతో భయాందోళనకు లోనైన సంఘవి.. శ్రీకాంత్ చేతిలోని మందు డబ్బా లాక్కుని.. తాను కూడా తాగింది. కానీ ఇద్దరికి చనిపోవాలని లేదు.. ఏదో క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో బతకడానికి శతవిధాలా ప్రయత్నించారు. వెంటనే దీని గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. తాము వచ్చిన ఆటోలోనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో.. వైద్యుల సూచన మేరకు ఇరువురి తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. కొన్ని గంటల వ్యవధిలోనే సంఘవి కూడా కన్నుమూసింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. ఇలా చావు మేళం వినాల్సి వస్తుందని అనుకోలేదంటూ శ్రీకాంత్, సంఘవిల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇద్దరు కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే.. కొన్ని రోజుల్లో అప్పులు తీరిపోయేవి కదా.. చిన్న సమస్య కోసం ప్రాణాలు తీసుకున్నారు అంటున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.