ఒకప్పుడు గురువుల వద్ద విద్యార్థులు చదువుకునేవారు.. కాని ఇప్పుడు మాత్రం చదువుని కొంటున్నారు. మద్యతరగతి కుటుంబాల వారు తమ పిల్లలను చదివించడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమ స్థాయికి మించి పిల్లలను చదివించడం కోసం అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయినా కొన్ని సార్లు స్కూల్, కళాశాల యాజమాన్యాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తమ కళాశాలలో చదువువుతున్న విద్యార్థి ఫీజు పెండింగ్ ఉందని అతని సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిన్నారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాలకు చెందిన జక్కుల శ్రీనివాస్ తనయుడు అంజిత్ ఎస్ ఆర్ గాయత్రి కళాశాలలో ఇంటర్ చదివాడు. ఈ క్రమంలోనే ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. ఇంజనీరింగ్ లో సీటు రావడంతో ఇంటర్ కి సంబంధించిన సర్టిఫికెట్లు అవసరం కావడంతో తన తండ్రితో కాలేజ్ కి వెళ్లాడు అంజిత్. కాలేజ్ పెండింగ్ ఫీజు రూ.40 ఉన్నాయని.. ఫీజు మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. మరోవైపు 27న ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందని.. సర్టిఫికెట్లు ఎంతో అవసరం అని అంజిత్ తండ్రి శ్రీనివాస్ కాజేజ్ సిబ్బందింని ఎంతగానో బతిమలాడాడు.
తాము ఎంతగా ప్రాదేయపడినా కాలేజ్ ప్రిన్సిపాల్ వినిపించుకోకపోవడంతో తండ్రీ కొడుకులు నిరాశతో ఇంటికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎంతో మనస్థాపానికి గురైన అంజిత్ శనివారం పురుగుల మందు తాగాడు.. అది గమనించిన అతని సోదరుడు వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తీసుకు వచ్చాడు. అంజిత్ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో వెంటనే కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అంజిత్ సోమవారం కన్నుమూశాడు. తన కొడుకు నిండు జీవితాన్ని బలి తీసుకున్న కాలేజ్ యాజమాన్యంపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.