లవ్‌టుడే.. ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన సినిమా ఇది. ఈ సినిమా కథ మొత్తం ప్రేమికులు ఒకరి సెల్‌ఫోన్ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్న దాని మీదే నడుస్తుంది. పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలుసు అనుకుంటున్న ప్రేమికుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు రేపుతుంది. ఇద్దర్నీ విడిపోయే వరకు తీసుకెళుతుంది. కానీ, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఇద్దర్నీ మళ్లీ కలుపుతుంది. ఇది సినిమా.. మరి, నిజ జీవితంలో ఇలా ఆడ, మగ ఫోన్లు మార్చుకుంటే ఏమవుతుందో ఊహించటం కష్టమే. కానీ, ఈ ఊహకందని పనిని ఓ జంట చేసి చూపింది. సెల్‌ఫోన్లు మార్చుకున్న తర్వాత యువకుడి అసలు రూపం బయట పడింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. యువకుడు జైలు పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
తమిళనాడులోని బేలూరుకు చెందిన అరవింద్ అనే 23 ఏళ్ల కుర్రాడు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి బేలూర్ టౌన్‌కు చెందిన ఓ యువతితో కొద్ది నెలల క్రితం నిశ్చితార్థం అయింది. ఇద్దరూ ఫోన్లలో తరచుగా మాట్లాడుకునే వారు. ఈ నేపథ్యంలోనే వీరు లవ్‌టుడే మూవీలోలా చేయాలనుకున్నారు. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని అనుకున్నారు. ఒకరి ఫోన్లు ఒకరు మార్చుకున్నారు. అయితే, ఆ ఫోన్లలో ఉన్న పర్సనల్ డేటాను ఎవ్వరూ డిలీట్ చేయలేదు. అదే యువకుడి కొంప ముంచింది. ఫోన్లు మార్చుకున్న తర్వాత.. యువతి అరవింద్ ఫోన్‌ను చెక్ చేసింది. ఆ ఫోన్‌లో ఓ బాలిక నగ్న వీడియో బయటపడింది. ఆ వీడియో చూసి యువతి షాక్ అయింది.
వీడియో గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు అరవింద్‌తో పెళ్లిని రద్దు చేసుకున్నారు. స్టోరీ అంతటితో ఆగలేదు. యువతి తన బంధువుల సహాయంతో బాలిక కుటుంబసభ్యులను కలిసింది. వారికి విషయం చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇప్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతడి ఫోన్‌లో ఇంకెవరివైనా వీడియోలు ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నారు. మరి, లవ్‌టుడే సీన్‌ను రిపీట్ చేసి జైలు పాలైన యువకుడి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.