ఫ్యాక్టరీలో కలిసిన వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమకు పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో సంతోషంతో ఎగిరి గత్తేశారు ఆ ప్రేమ జంట. పెద్దలు అంగీకరించారు ఇంకేముంది త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాం అనుకుంది ఆ జంట. కానీ ఇంతలోనే అనుకోని ఓ యువతి ఉపద్రవంలా వచ్చి ఆ జంటను నిలువునా ముంచింది. దాంతో ఆ ప్రేమ జంట ఒకే చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ ఆత్మహత్యకు పాల్పడింది. వీరి జీవితంలోకి వచ్చిన ఆ యువతి ఎవరు? ఆమెకు వీరికి సంబంధం ఏంటి? లాంటి మరిన్ని విషయాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కల్లుగుడ్డెకి చెందిన దర్శన్ మంగుళూరులోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా హాన్ బాళుకు చెందిన పూర్విక అనే యువతి కూడా అదే ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఒకే ఫ్యాక్టరీ కావడంతో దర్శన్, పూర్వికల మధ్య పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో.. పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దర్శన్ గ్రామానికి చెందిన ఓ యువతి ఈ జంట మధ్యలోకి ఎంటరైంది. దర్శన్ నన్ను ప్రేమించి గర్భవతిని చేశాడని కొన్ని రోజుల కిందట మల్లందూరు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయమై పోలీసులు దర్శన్ ను పిలిపించి విచారించారు. ఇక ఈ సంగతి పూర్వికకు తెలియడంతో దర్శన్ ను నిలదీసింది. అయితే మూడు రోజుల క్రితం దర్శన్ ఊరికి వచ్చిన పూర్విక అతడితో మాట్లాడింది. మూడో యువతి వీళ్ల మధ్య రావడంతో ఇక తమకు పెళ్లి కాదని భావించి.. తాము చినిపోతున్నట్లు తల్లిదండ్రులకు వాయిస్ మెసేజ్ చేశారు. అనంతరం ఆల్దూరు సమీపంలోని గుల్షన్ పేట వద్ద సత్తిహళ్లిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన జంట ఇలా చెట్టుకు ఉరికి వేలాడటం చూసిన తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.