రౌడీ షీటర్ దగ్గర అప్పు తీసుకోవటమే ఆమె చేసిన పాపం అయిపోయింది. సకాలంలో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని రౌడీ షీటర్ ఆ మహిళపై రెచ్చిపోయాడు. ఫోన్ చేసి మరీ దారుణంగా తిట్టాడు. దీంతో ఆమె మనస్తాపానాకి గురైంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కరీనంగర్ జిల్లా, రామడుగు మండలం కొక్కెర కుంట గ్రామానికి చెందిన బత్తిని సత్యనారాయణ, రేణుక భార్యాభర్తలు. వీరు కొన్ని నెలల క్రితం వన్నారం గ్రామానికి చెందిన మాజీ రౌడీ షీటర్‌గా పేరు పొందిన ఓ వ్యక్తి దగ్గర కొంత సొమ్ము అప్పు తీసుకున్నారు. అయితే, అప్పు తిరిగి ఇస్తామని చెప్పిన సమయానికి చెల్లించలేకపోయారు. డబ్బు సర్ధుబాటు కాకపోవటంతో మాట తప్పారు.
దీంతో సదరు మాజీ రౌడీ షీటర్ వీరిపై రెచ్చిపోయాడు. ఫోన్ చేసి రేణుకను బాగా తిట్టాడు. అతడి తిట్లు విన్న రేణుక మనసు ముక్కలైంది. ఎందుకు బతకాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ దగ్గరకు వెళ్లింది. ఫ్యానుకు ఉరిని బిగించింది. తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంసభ్యులు ఆమెను చూసి షాక్ తిన్నారు. భార్య మృతితో సత్యనారాయణ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇక, రేణక కుటుంబసభ్యులు కరీంనగర్ సీపీని కలిశారు. మాజీ రౌడీ షీటర్ రేణుకను తిట్టిన తిట్ల తాలూకా ఆడియోను ఆయనకు అందజేశారు.నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.