ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలోని హాస్పిటల్ సన్నివేశం గుర్తుంది కదా..! ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ అతనికి రక రకాల టెస్టుల పేరిట డబ్బులు వసూళ్లు చేస్తారు వైద్యులు. ఆ పేషెంట్ కి ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని కుటుంబ సభ్యులను మభ్యపెడతారు. అందినంత డబ్బు తీసుకొని చివరికి పేషెంట్ ని బతికించేందుకు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ చనిపోయాడని చావు కబురు చల్లగా చెబుతారు.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇలాంటి ఘటనలకు సంబందించిన వార్తలు వస్తూనే ఉంటాయి. ఓ మహిళ గర్బవతి అని చెప్పి దాదాపు తొమ్మిది నెలలు రక రకాల టెస్టులు చేసి చికిత్స అందించారు. తీరా డెలివరీ సమయానికి ఆమె ప్రెగ్నెన్సీ కాదని తేలడంతో కుటుంబ సభ్యులు ఖంగు తిన్నారు. ఈ ఘటన కాకినాడలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మహాలక్ష్మి అనే మహిళకు కొంత కాలం క్రితం సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లైంది. కొద్ది రోజులుగా మహాలక్ష్మిలో మార్పు రావడం చూసి ఆమెను కాకినాడ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించారు. డాక్టర్ కొన్ని టెస్టులు పంపించిన తర్వాత మహాలక్ష్మి ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఈ వార్త విని దంపతులు ఎంతో సంతోషించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలని చెప్పడంతో తొమ్మిది నెలల పాటు హాస్పిటల్ లో టెస్టులు చేయించుకుంది. ఆస్పత్రి సిబ్బంది రాసిన మందులు వాడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ప్రసవం తేది కూడా ఇవ్వడంతో ఆమెను పుట్టింటికి పంపాడు సత్యనారాయణ.
తన తల్లిగారింటికి వచ్చిన మహాలక్ష్మి డెలివరీ టైమ్ దగ్గరపడటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించారు. స్కానింగ్ తీసిన తర్వాత అసలు విషయం తెలుసుకున్న మహాలక్ష్మి కుటుంబ సభ్యులకు మైండ్ బ్లాక్ అయ్యింది. దీంతో కంగారు పడ్డ మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొని కాకినాడలో మొదటి నుంచి ట్రీట్ మెంట్ చేయిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వచ్చి స్కానింగ్ చేయించారు. అసలు ఆమె గర్భంలో శిశువు లేదని స్కానింగ్ రిపోర్టు రావడంతో వైద్యులను నిలదీశారు కుటుంబ సభ్యులు.
ఆమెను పరీక్షించిన డాక్టర్ కూడా పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో తమను దారుణంగా మోసం చేశారని హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల పాటు పరీక్షలు జరిపి.. స్కానింగ్ లు తీయించి, ఎన్నో రకాల మందులు వాడమని చెప్పిన డాక్టర్లు ఇప్పుడు అసలు కడుపులో శిశువు లేదని చెప్పడం ఎంత వరకు న్యాయం అని.. వారు ఇచ్చిన మెడిసన్స్ తో తమ బిడ్డ పొట్ట పెద్దగా కనిపించిందని.. డబ్బు కోసం ఇంత నీచానికి దిగిన హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. హాస్పిటల్ నిర్వాకానికి సంబంధించిన వార్తలు బయటకు రావడంతో కాకినాడలో కలకలం రేగింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.