యావత్ దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్సవం వినాయక చవితి. దీని కోసం నగరంలో ప్రజలంతా ఇప్పటికే మండపాలు సైతం సిద్దం చేసి ఉంచారు. ఈ ఉత్సవాన్ని వయసులో తేడా లేకుండా ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్ద వయసుల వరకు అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ వినాయకుడిని కొలుస్తుంటారు. అయితే ప్రతీ ఏటా నిర్వహించే ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖర్చు కూడా బాగానే అవుతుండడం విశేషం. కాగా భక్తులు పండగ రోజు కంటే ఓ రోజు ముందుగానే తమకు నచ్చిన వినాయకుడి విగ్రహాన్ని కొంటారు. అయితే ప్రస్తుతం అన్ని రకాల ధరలు పెరగడంతో వినాయక అమ్మకం దారులు సైతం ఈ ఏడాది విగ్రహాల ధరలు కూడా బాగానే పెంచేశారు.
ఇక విషయం ఏంటంటే? హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ముగ్గురు యువకులు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ముందుగా హయత్ నగర్ లో రోడ్డుపై అమ్ముతున్న విగ్రహాలు అమ్మే స్థలానికి వెళ్లి ధరలు తెలుసుకున్నారు. రూ.5 వేల నుంచి రూ. 10 వేల లోపు ఉండడంతో ధరలను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. భగ్గుమన్న ధరలను చూసి అక్కడి నుంచి కొనకుండానే వెనుదిరిగారు. ఇంత ధరలు ఉంటే కొనలేం అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఆ ముగ్గురు యువకులు అదే రోజు రాత్రి వినాయకుడి విగ్రహాన్ని దొంగతనం చేయాలని అనుకున్నారు.
ఇందులో భాగంగానే రోడ్డుపైన ఉన్న వినాయకుడి విగ్రహాల షాపు వద్దకు వెళ్లారు. అర్థరాత్రి, పైగా జోరుగా వర్షం కురుస్తుంది. అటూ ఇటూ చూశారు. జనాలు కనిపించినా తమను ఎవరూ చూడడం లేదనే భ్రమలో ఉండిపోయారు. ఇక చడి చప్పుడు కాకుండా వారికి నచ్చిన వినాయక విగ్రహాన్ని ఆ మగ్గురు యువకులు భుజన వేసుకుని రోడ్డు దాటారు. అనంతరం ముందుగా తెచ్చుకున్న ఆటోలో ఆ విగ్రహాన్ని ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. వినాయకుడి విగ్రహ దొంగతనానికి పాల్పడ్డ యువకుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.