హైదరాబాద్ లోని బోరబండలో ఓ యువకుడు సెల్ ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.
ప్రియురాలు మోసం చేసిందని, తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నానని, అనుకున్నది సాధించలేకపోయాననే కారణాలతో నేటి కాలం యువత ఆత్మహత్యలకు పాల్పడి కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. కానీ, తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు మాత్రం మొబైల్ ఫోన్ పోయిందని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బోరబండలోని రాజనగర్ లో చుక్కా సాయి కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు నగరంలో బిగ్ బాస్కెట్ డెలవరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గతంలో సాయి కుమార్ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో ఫోన్ పొగొట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి తండ్రి EMI విధానంలో రూ.28 వేలతో మరో విలువైన మొబైల్ ఫోన్ ను కొనిచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచిందో లేదో.. సాయి కుమార్ ఇటీవల కొత్త మొబైల్ ఫోన్ ను కూడా పోగుట్టుకున్నాడు. దీంతో ఆ యువకుడికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే మందలిస్తాడనే భయంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే సాయి కుమార్ సోమవారం తుకారం రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సాయి కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న సాయి కుమార్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. సెల్ ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్న యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.