బీమా ఏజెంట్లమని చెప్పుకుంటూ అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తారు. పార్టీలు నిర్వహించి అక్కడకు వచ్చిన అమ్మాయిలకు డ్రగ్స్ ఎర వేస్తారు. పొరపాటున డ్రగ్స్ అలవాటు చేసుకుంటే ఇక ఆ అమ్మాయి పరిస్థితి అంతే. మత్తులోకి వెళ్ళగానే ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడతారు. ఒక ఐటీ ఉద్యోగిని అరెస్ట్ తో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు వల వేసి పట్టుకున్నారు. ముంబాయికి చెందిన జతిన్ బాలచంద్ర భలేరావు (36), జావేద్ షంషేర్ అలీ సిద్ధిఖీ (34), జునైద్ షేక్ షంషుద్దీన్ (28), వికాస్ మోహన్ కుమార్ అలియాస్ విక్కీ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బీమా ఏజెంట్ నని చెప్పుకుంటూ జతిన్.. ముంబై సింథటిక్ డ్రగ్ డీలర్ల నుంచి నిషేధిత ఎండీఎంఏను కిలో రూ. 10 లక్షలకు కొనుగోలు చేసి.. 5,10 గ్రాముల చొప్పున మార్కెట్ లో రూ. 20 లక్షలకు విక్రయిస్తున్నాడు.
స్నేహితుడు జావేద్ తో కలిసి పార్టీలు నిర్వహిస్తూ.. పార్టీకి వచ్చే ఆడపిల్లలకు ఎండీఎంఏ డ్రగ్స్ అలవాటు చేసేవారు. ఆడపిల్లలు మత్తులోకి వెళ్ళగానే వారిపై లైంగిక దాడి చేసేవారు. జతిన్ కస్టమర్లలో 81 మంది, జావేద్ కస్టమర్లలో 30 మంది అమ్మాయిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన వికాస్, దినేష్ సోదరులు, జునైద్ షేక్ షంషుద్దీన్ లు జతిన్, జావేద్ ల నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి కస్టమర్లకు చేరవేసేవారు. అయితే హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో ముంబైకి చెందిన సనాఖాన్ (34) గత ఏడాది ఏప్రిల్ నెలలో కొండాపూర్ వచ్చింది.
ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉండడంతో ఎండీఎంఏ కోసం వీకెండ్ సమయంలో ముంబై వెళ్ళేది. అక్కడ గ్రాము రూ. 100 చొప్పున 10 నుంచి 20 గ్రాములు కొనుగోలు చేసి.. హైదరాబాద్ లోని అమ్మాయిలకు గ్రాము రూ. 2 వేలకు విక్రయించేది. అయితే గత నెల 9న ముంబై నుంచి రైలులో 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో వస్తుండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గోపాలపురం పోలీసులు సనాఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి సమాచారం రాబట్టి.. డెకాయ్ ఆపరేషన్ ద్వారా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కస్టమర్లుగా పరిచయం చేసుకుని డ్రగ్స్ కావాలంటూ పోలీసులు నటించి.. ఆ జతిన్, జావేద్, జునైద్ షేక్ షంషుద్దీన్, వికాస్ లను అరెస్ట్ చేశారు.
వీరితో పాటు మరో నిందితుడు దినేష్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసి లైంగిక దాడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సనాఖాన్ వద్ద హైదరాబాద్ కి చెందిన 20 మంది అమ్మాయిలు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక జతిన్, జావేద్ కస్టమర్లుగా 111 మంది యువతులు కస్టమర్లుగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ అలవాటు చేసి అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు.