నేటి కాలంలో చాలా మంది ప్రతీ చిన్న సమస్యకు పరిప్కారమే లేదన్నట్లుగా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఇలా సమస్యలతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి సమాచారం మీ కోసం.
అది హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామం. ఇక్కడే జక్కుల రాజ్ కుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గతంలో డిగ్రీ పూర్తి చేసిన రాజ్ కుమార్ గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్దం అవుతున్నాడు. అయితే గతంలో అనేక పరీక్షలు కూడా రాశాడు. ఇదిలా ఉంటే ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రాజ్ కుమార్ తోటి స్నేహితులు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడడంతో చాలా మంది ఇతడిని చులకనగా చూసేవారట. ఉద్యోగం రాకున్న సరే.. ఏదైన పని చేసుకుని బతకొచ్చని తల్లిదండ్రులు కూడా సూచించారు. కానీ గ్రామంలోని జనాలు ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుకోవడంతో రాజ్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఈ తరుణంలోనే రాజ్ కుమార్ కు ఏం చేయాలో అర్థంకాక ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ రాజ్ కుమార్ తాజాగా ప్రాణాలు విడిచాడు. రాజ్ కుమార్ చనిపోవడంతో అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్న ఇలాంటి యువతకు మీరిచ్చే సూచనలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.