హన్మకొండ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోతులు విధ్వంసం సృష్టించడంతో ఓ మహిళ నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అది హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామం. వరంగంటి కమలాకర్ రెడ్డి, రజిత ఇద్దరు భార్యాభర్తలు. శనివారం వీరి గ్రామంలోకి కోతులు గుంపులు గుంపులుగా వచ్చాయి. కొద్దిసేపు ఊళ్లో అంతా నానా హంగామా చేశాయి.
ఈ క్రమంలోనే ఆ కోతుల గుంపు రజిత ఇంట్లోకి వెళ్లి వస్తువులను చెల్లా చెదురుగా పడేశాయి. దీంతో పాటు ఇంటికి సంబంధించిన కరెంట్ తీగలను సైతం లాగేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే ఇళ్లంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ అంటుకోవడంతో తీగపై బట్టలు ఆరేస్తున్న రజితకు కరెంట్ షాక్ తగిలింది. దీనిని చూసిన భర్త కమలాకర్ రెడ్డి వెంటనే ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు.
ఇక రెప్పపాటులోనే అతనికి కూడా కరెంట్ షాక్ తగిలింది. గమనించిన స్థానికులు కమలాకర్ రెడ్డిని రక్షించారు కానీ అతని భార్య రజిత ప్రాణాలు కోల్పోయింది. కోతుల విధ్వంసానికి ఓ నిండు ప్రాణం బలవ్వడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కోతుల విధ్వంసానికి బలైన ఓ మహిళ ప్రాణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.