విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే సూటి పోటి మాటలతో వేధించారు. చదువులో వెనుకబడిన విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిపోయి.. చదువుకే పనికిరావన్నారు. చదువు రాని వాడికి తిండి దండగ అంటూ చేతిలో కంచం లాక్కుని వెళ్లిపోమన్నారు. ఇంకో గురువు టీసీ తీసుకుని వెళ్లాలంటూ ఛీదరించుకున్నాడు. ఇలాంటి ఛీత్కారాలు ఎదుర్కొన్న ఆ విద్యార్థి చివరికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు రైలుపేటకు చెందిన అంజమ్మకు ఇద్దరు కుమారులు. భర్త ఎనిమిదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లే కూలిపనులు చేస్తూ ఇద్దరు పిల్లలను సాకుతోంది. చిన్న కుమారుడు ఆకాశ్(18) చదువులో కాస్త వెనుబడి ఉన్నాడు. నెహ్రూనగర్‌లోని ప్రభుత్వ పాఠాశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఓరోజు మధ్యాహ్న భోజనం చేసేందుకు అందరి విద్యార్థులతో కలిసి వెళ్లగా ఓ టీచరమ్మ చేతిలో కంచం లాక్కుని చదువురాని వాడికి తిండి దండగ అంటూ అన్నదంట.
ఆకాశ్ ఇంటికి వెళ్లి తల్లితో ఆ మాట చెప్పుకుని బాధ పడ్డాడు. తల్లి నచ్చజెప్పి స్కూలుకు పంపింది. ఆ తర్వాత మళ్లీ మరో ఉపాధ్యాయుడు చదువురాని వాడికి బడెందుకు టీసీ తీసుకెళ్లు అంటూ ఛీత్కరించుకున్నాడంట. అంతేకాకుండా బడి మానేసి ప్రైవేటుగా పదో తరగతి రాసుకోవాలంటూ సలహా ఇచ్చారంట. మళ్లీ తల్లి దగ్గర తన బాధ చెప్పుకుని ఆకాశ్ బాధ పడ్డాడు. గత నాలుగు రోజులుగా స్కూలుకు వెళ్లడం మానేశాడు. తల్లితోనే పని దగ్గర ఉంటూ వచ్చాడు. సోమవారం పెద్ద కుమారుడు ఇంటి తాళం అడగ్గా.. ఆకాశ్ తీసుకుని ఇంటికి వచ్చాడు.
అన్న బియ్యం పొయ్యిమీద పెట్టి కూరగాయల కోసం అని వెళ్లాడు. అప్పటికే మనస్తాపంలో ఉన్న ఆకాశ్ తల్లి చీరతో ఉరివేసుకున్నాడు. ఇంటికి వచ్చి చూడగానే అన్న నిర్ఘాంతపోయాడు. వెంటనే తల్లిని పిలిచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే లేట్ అయ్యిందని జీజీహెచ్‌కు తీసుకెళ్లమన్నారు. తీరా అక్కడకు వెళ్తే అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోయిన కొడుకుని చూసి గుండెలు బాదుకుంటూ తల్లి ఏడ్చింది. ఉపాధ్యాయుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.