Crime News: ఆడవాళ్ల మీద అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నలుగురూ తిరిగే చోట కూడా వారికి రక్షణ లేకుండా పోతోంది. తాజాగా, ఓ కాంపౌండర్.. రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని ఓ జిల్లా ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, ధోల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్య సమస్యలతో జిల్లా ఆసుపత్రిలో చేరింది. అదే ఆసుపత్రిలో రామ్ లఖన్ పర్మార్ అనే వ్యక్తి కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి సదరు మహిళ ఉండే వార్డులో రామ్ లఖన్‌కు డ్యూటీ పడింది. ఈ నేపథ్యంలో అతడు బుల్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను గదిలోకి ఒంటరిగా తీసుకెళ్లాడు.
నిమిషాలు గడుస్తున్నా ఇద్దరూ గదిలోంచి బయటకు రాలేదు. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఆ గది దగ్గరకు వెళ్లారు. తలుపులు తెరవటానికి ప్రయత్నించగా లోపలినుంచి గడియపెట్టబడి ఉంది. దీంతో వారి అనుమానం మరింత పెరిగింది. తలుపులు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అక్కడి దృశ్యాలు చూసి స్థానువయ్యారు. సదరు కాంపౌండర్, మహిళ నగ్నంగా ఉన్నారు. ఇక, మహిళ కుటుంబసభ్యుల్ని చూడగానే అతడు త్వరగా బట్టలు వేసుకున్నాడు. ఈ దృశ్యాలనంతా వారు వీడియో తీశారు. అయితే, సదరు మహిళ కుటుంబం సమాజానికి భయపడి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
కానీ, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జిల్లా ఆసుపత్రి అధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నేరం రుజువైతే సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయటానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనపై జరిగిన లైంగిక దాడిపై బాధితురాలు మాట్లాడుతూ..‘‘నేను కొన్ని రోజుల నుంచి ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఆ కాంపౌండర్‌కు ఆదివారం నా వార్డులో డ్యూటీ పడింది. మందులిస్తాను రమ్మని నన్ను గదిలోకి తీసుకెళ్లాడు. నన్ను నేలపై పడుకోమన్నాడు. తర్వాత నాతో తప్పుగా ప్రవర్తించాడు. కొద్దిసేపటి తర్వాత మా కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు’’ అని తెలిపింది.