ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు హత్యలు జరగటం ఎక్కువయిపోయింది. అది కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా, ఓ విచిత్రమై సంఘటన చోటుచేసుకుంది. టమోటాల విషయంలో గొడవ జరిగి భార్యను చంపాడు ఓ భర్త. ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీష్‌ఘర్, రాయ్‌ఘర్ జిల్లాలోని బేడిముడ గ్రామానికి చెందిన భగత్ రామ్, దిలో బాయ్ భార్యభర్తలు. ఘటన జరిగిన రోజు రాత్రి దిలో బాయ్ భోజనం తయారు చేయటానికి సిద్ధమైంది. రాత్రి భోజనం కోసం టమోటా కూర చేయాలనుకుంది.
అయితే, ఇంట్లో టమోటాలు కనిపించలేదు. దీంతో ఆమె పక్కింట్లోకి వెళ్లి టమోటాలు అప్పు అడగాలని అనుకుంది. పక్కింటికి వెళుతుండగా భర్త ఆమెను చూశాడు. ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. అన్నంలోకి టమోటా కూర చేయటానికి ఇంట్లో టమోటాలు లేవని, పక్కింట్లో అప్పు అడగటానికి వెళుతున్నానని చెప్పింది. భగత్ రామ్ ఇందుకు ఒప్పుకోలేదు. పక్కింటికి వెళ్లొద్దని అన్నాడు. దిలో బాయ్ భర్తకు ఎంతగానో చెప్పి చూసింది. అయినా అతడు వినలేదు. ఇద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత గొడవ పెద్దదైంది. భార్య తనకు మాటకు మాట సమాధానం ఇస్తూ ఉండటంతో అతడు కోపంతో రగిలిపోయాడు.
కర్ర తీసుకుని ఆమెను కొట్టసాగాడు. ఆ దెబ్బలు తాళలేక ఆమె అతడ్ని పక్కకు తోసింది. భార్య తనను తోయటంతో భగత్ రామ్ మరింత కోపం తెచ్చుకున్నాడు. రెట్టించిన కోపంతో భార్యను కర్రతో చావ బాదాడు. తలపై కూడా దెబ్బలు బాగా తగిలాయి. తల వెనకాల తీవ్ర గాయం అవ్వటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దిలో బాయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భగత్ రామ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.