ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గుండెపటు అనే పదం వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. మొన్నటి వరకు కరోనా భయపెడితే.. ఇప్పుడు గుండెపోటు భయపెడుతుంది. వరుసగా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వారు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. అప్పటి వరకు మనతో కలిసి ఉన్నవాళ్లు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా చిన్న వయసులో కూడా గుండెపోటు మరణాలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గుండెపోటు పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఇన్స్పెక్టర్లు గుండెపోటుతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. విశాఖలో షటిల్ ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు సీబీఐ ఇన్స్పెక్టర్. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం సీబీఐ ఆఫీస్ లో ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న ఎన్. వెంకట శర్మ వయసు 54 సంవత్సరాలు కార్డియాక్ అరెస్ట్ కి గురై కన్నుమూశారు. ఆదివారం ఉదయం సీబీఐ ఆఫీస్ ఆవరణలో ఉన్న షటిల్ కోర్ట్ లో సహ ఉద్యోగులతో కలిసి షటిల్ ఆడుతున్నాడు. అదే సమయంలో హఠాత్తుగా అక్కడే కుప్పకూలిపోయారు. సహ ఉద్యోగులు వెంకట శర్మను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కార్డియాక్ అరెస్ట్ కి గురై చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. వెంకట శర్మ గతంలో సీఐఎస్ఎఫ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేశారు.. ఐదు సంవత్సరాల క్రితమే విశాఖ సీబీఐ కి డిప్యూటేషన్ పై వచ్చారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తాడేపల్లి.
ఇక మరో ఘటనలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు సీఐగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, వయసు 46.. ఇంట్లోనే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. డీఎస్పీ ఆఫీస్ లో సమావేశం ముగించుకొని ఇంటికి వెళ్లి భోజనం చేసిన నాగేశ్వరరావు కొద్ది సేపటి తర్వాత ఛాతి నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కానిస్టేబుల్ వచ్చి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. సీఎం గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. సీఐ నాగేశ్వరరావు స్వగ్రామం బాపట్ల జిల్లా చీరాల. ఐదు నెలల క్రితమే పదోన్నతిపై ఆత్మకూరు సీఐగా బాధ్యతలు స్వీకరించారు నాగేశ్వరరావు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఇన్స్పెక్టర్లు గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదాలు నిండుకున్నాయి.