ఆ బాలుడికి ఏం తెలుసు.. తన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయిందని. తల్లి చనిపోయిందని తెలియక ఒడిలో నిద్రపోయాడు. కొద్దిసేపటికి లేచి.. అమ్మా ఆకలేస్తోంది లే అమ్మా.. అంటూ తల్లిని లేపసాగాడు.. కానీ ఆ తల్లిలో చలనం లేకపోవడంతో.. అమ్మా అంటూ గట్టిగా రోదిస్తూ ఏడ్వసాగాడు. ఏం జరిగిందా అని అక్కడికి వచ్చి చూసిన తోటి ప్రయాణీకులు ఆ దృశ్యం చూసి చలించిపోయారు. చిన్నారిని దగ్గరకు తీసుకొని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హృదయవిదారక ఘటన బీహార్ రాష్ట్రంలోని భాగల్ పుర్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.
గత సోమవారం బీహార్ రాష్ట్రంలోని భాగల్ పుర్ రైల్వే ప్లాట్ ఫాంపై ఒక మహిళ చనిపోయింది. ఆ విషయం తెలియక ఐదేళ్ల ఆమె కుమారుడు తల్లి మెడ చుట్టూ చేతులువేసి ఒడిలో నిద్రపోయాడు. కొద్ది సేపటి తర్వాత ఆకలి అవుతుందని తల్లిని లేపడంతో ఎంతకీ లేవలేదు.. దాంతో ఏడ్వటం మొదలు పెట్టాడు. అక్కడికి వచ్చిన తోటి ప్రయాణీకులు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని కొడుకు బాధ చూసి చలించిపోయారు.. వెంటనే భాగల్ పుర రైల్వే పోలీసులు సమాచారం అందించారు.
రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. తల్లి, కుమారుడి వివరాలు సేకరించేందుకు ఇద్దరి ఫోటోలు తీసి పలు చోట్ల ఏర్పాటు చేసినప్పటికీ ఎవరూ రాలేదు. దీంతో పోలీసులే ఆ మహిళలకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ మహిళ ఏలా చనిపోయిందన్న విషయం పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తుందని అధికారులు తెలిపారు.
ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. ఆ మహిళ ఎలా చనిపోయిందనే విషయం పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుందని.. ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని 72 గంటల పాటు మార్చురీలో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ హృదయవిదారక ఘటన గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.