ఈ మద్య కాలంలో దేశంలో ఈజీ మనీ కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారు అమాయకంగా ఉంటే నిలువుదోపిడి చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ నేరాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక జంట క్యాబ్ బుక్ చేసుకొని డ్రైవర్ తో మాటా మాటా కలిపి కష్టనష్టాల గురించి మాట్లాడుకున్నారు. డ్రైవర్ కూడా ఆ జంట ఎంతో మంచివారని నమ్మాడు.. అలా తమ బుట్టలో పడేసిన క్యాబ్ డ్రైవర్ ని దారుణంగా మోసం చేసి కారుతో ఉడాయించారు. ఈ ఘటన బెంగుళూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు యలహంక లో మేక మంజ అనే ఒక రౌడీషీటర్ అతని భార్య వేదవతి రాత్రి సమయంలో ఓలా కారు ని బుక్ చేసుకున్నారు. అలా కారులో నగరంలో కొన్ని ప్రదేశాలు తిరిగారు. ఆ సమయంలో కారు డ్రైవర్ శివ శంకర్ తో భార్యాభర్తలు ఎంతో అనుకువగా మాట్లాడి అతడి మంచీ చెడుల గురించి ఆరా తీశారు. అతనికి ఎంతో నమ్మకాన్ని కలిగించారు. డ్రైవర్ శంకర్ తో ఆకలి అవుతుంది.. డాబాలో భోజనం చేద్దాం అని అన్నారు. అంతకు ముందు మద్యం షాపు వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి డ్రైవర్ కి బాగా తాపించారు.
మద్యం సేవించిన డ్రైవర్ పూర్తిగా మత్తులోకి జారుకున్నాడు. తమ ప్లాన్ మంచి సక్సెస్ అయిందనుకున్న కేడీ జంట ఆ డ్రైవర్ వద్ద ఉన్న తాళాలు తీసుకొని కారుతో ఉడాయించారు. అదే సమయంలో డ్రైవర్ వద్ద ఉన్న సెల్ ఫోన్ ని కూడా ఎత్తుకు వెళ్లారు. మత్తు నుంచి తేరుకున్న డ్రైవర్ తాను ఘోరంగా మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేడీ జంటను పట్టుకున్నారు. కారు, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు.