సాధారణంగా చాలా మంది మగవారికి.. తన తల్లి, అక్కాచెల్లెళ్లు అంటే అంతులేని ప్రేమ.. గౌరవం ఉంటాయి. కానీ అదే భార్య విషయానికి వస్తే.. గతి లేక తమ ఇంటికి వచ్చిన ఓ పనిమనిషిలా చూస్తారు. తనకు, తన వారికి సేవలు చేయడానికి వచ్చింది.. తాను చెప్పినట్లు నడుచుకోవాలి.. కొట్టినా, తిట్టినా పడి ఉండాలి అని భావించే.. మగవాళ్లకు కొదవ లేదు. ఇక చాలా మంది.. కట్నం డబ్బులు, గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం భార్యను వేధిస్తారు. ఇక మరికొందరు సంతానం గురించి లేదంటే.. మగపిల్లాడి కోసం భార్యను ఇబ్బందులకు గురి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్యకు సంతానం కలగడం లేదని.. ఆమె కాలు చేయి విరిచాడు.. ఓ మృగాడు. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన కర్నూల్ జిల్లా, డోన్ మండలం చనుగొండ్లలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం.. చందోలి గ్రామానికి చెందిన లాలప్ప, ఆదిలక్ష్మిలకు భవానీ అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఆమెను డోన్ మండలం, చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి.. మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. అయితే.. పెళ్లైన నాటి నుంచి.. రాము.. తమ కుమార్తెను వేధిస్తున్నాడని తెలిపారు. బిడ్డలు కలగడం లేదని.. భవానీని నిత్యం వేధించడమే కాక.. రాము తల్లిదండ్రులు కూడా ఆమెను చిత్ర హింసలకు గురి చేసేవారని తెలిపారు.
ఈ క్రమంలో మంగళవారం.. సంతానం విషయంలో.. రాము, భవానీల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. అది కాస్త పెరిగి పెద్దదవ్వడంతో.. విచక్షణ మరిచిపోయిన రాము.. ఆ కోపంలో భవానీ కాలు, చేయి విరగొట్టాడు. తమ బిడ్డ చావుబతుకుల మధ్య ఉందని తెలియడంతో.. వెంటనే వెళ్లి.. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చామన్నారు. తర్వాత.. భవానీని పత్తికొంండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి.. ప్రథమ చికిత్స చేయించి.. పరిస్థితి విషమంగా మారడంతో.. కర్నూలుకు తరలించామని తెలిపారు. తమ కుమార్తెని ఇలా విచక్షణారహితంగా హింసించిన భర్త, అతడి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సంతానం అంటే.. దంపతులిద్దరి బాధ్యత. అలాంటిది.. బిడ్డల కోసం.. భార్యని ఇలా హింసించడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.