వారిది ఎంతో అందమైన జంట.. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ జంటపై ఏ కన్ను పడిందో ఏమో.. ఒక్కసారిగా వారి జీవితం ముక్కలైంది. రోజూ ఆనందంగా ఇంటికి వచ్చే భర్త ఆ రోజు రాలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలీదు. ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొద్దిసేపటికి వినకూడని వార్త విని.. ఆమె గుండె ముక్కలైంది. బోరున విలపించింది.. కట్టుకున్న వాడు కాలం చేశాడని తెలిసి గుండెలు బాదుకుని ఏడ్చింది. ఆమె రోధన చూసి బంధువులు, చుట్టుపక్కల వారి కళ్లు చెమ్మగిల్లాయి. పని నుంచి హుషారుగా రావాల్సిన భర్త.. విగతజీవిగా మారి వచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా చెట్నేపల్లికి చెందిన అశోక్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్ మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అశోక్ కి కొన్నేళ్ల క్రితం కవిత అనే మహిళతో వివాహం జరిగింది. వారివురూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. చుట్టుపక్కల వారు కూడా వారిద్దరి ఎంతో అందమైన జంట అంటూ ఉండేవారు. అంతా సక్రమంగా సాగుతున్న వారి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 12న అశోక్ చెట్నేపల్లి సమీపంలో విగతజీవిగా కనిపించాడు.
ఎప్పుడొప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూసిన భార్య కవిత.. అశోక్ పార్థీవ దేహం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. తన భర్త ఇక లేడనే వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. గుండెలవిసేలా విలపించింది. ఆమె ఆక్రందనలకు అయినవారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. భర్త మద్యం సేవిస్తూ కుంటలో పడి చనిపోయాడని తెలుసుకుని విలవిల్లాడింది. మద్యం సేవిస్తుండగా భర్త మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వారి అనుమానం బలపడింది. అశోక్ ది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదు.. హత్యగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. పోలీసులు దర్యాప్తులో స్పీడు పెంచారు. ప్రతి ఒక్కరిని అనుమానంతో ప్రశ్నించడం ప్రారంభించారు. అలా వారికి అశోక్ భార్య కవితపై అనుమానం కలిగింది.
భర్త మృతి కేసులో పోలీసులు దూకుడు పెంచడంతో కవితలో కంగారు మొదలైంది. ఆమెను చూసి మొదట్లో పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ, దర్యాప్తు వేగవంతం చేసిన తర్వాత ఆమె పాత్రపై క్రమంగా అనుమానం పెంచుకున్నారు. పోలీసులు తమదైనశైలిలో ప్రశ్నించగా అశోక్ భార్య కవిత అసలు విషయాలు వెల్లడించింది. ఆమె చెప్పిన మాటలు విని పోలీసులకే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎంతో మంచి దానిలా కనపించే అశోక్ భార్య కవితలో అంత చీకటి కోణం దాగుందని తెలుసుకుని పోలీసులే అవాక్ అయ్యారు.
నిజానికి అశోక్ ది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదు. స్వయంగా కవితనే అతడి ప్రాణాలు తీసింది. కవితకు బసినేపల్లి నివాసి హరికృష్ణతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని తెలిసి బంధువులు కూడా నమ్మలేకపోయారు. ఏప్రిల్ 12న అశోక్ చెట్నేపల్లి సమీపంలో మద్యం సేవిస్తున్నాడని తెలుసుకుని.. కవిత- హరికృష్ణ అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత అశోక్ కు బాగా మద్యం పట్టించి.. పక్కనే ఉన్న కాల్వలో పడేసి తొక్కి చంపేశారు.
ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి భర్త కనిపించడం లేదంటూ కవిత ఆడిన డ్రామాను అంతా నమ్మేశారు. చివరికి పోలీసులు అసలు విషయం బయటకు లాగి.. కవిత, హరికృష్ణలను అరెస్టు చేశారు. కవిత చేసిన ఈ పని ప్రస్తుతం అనంతపురం జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.