కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను నాశనం చేసింది. ఆప్తులను పొట్టనపెట్టుకుంది. ఆర్థికంగా కూడా దెబ్బ తీసింది. మహమ్మారి కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చెన్నైలో వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రముఖ నటి సోదరుడు, అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అమ్మి.. తాము ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో.. వారికి చెల్లించమని కోరుతూ.. సూసైడ్ నోట్ రాశారు. ఆ వివరాలు..
నటి ఊర్వశి సోదరుడు కమల్.. ప్రమీల (52) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె సోదరుడు కమల్, ఆయన భార్య ప్రమీలను చాలా సంవత్సరాల పాటు ఆర్థికంగా ఆదుకుంది నటి ఊర్వశి. రెండు సంవత్సరాల క్రితం కమల్, ప్రమీల దంపతుల మద్య గొడవలు రావడంతో వారు విడిపోయారు. కమల్ భార్య ప్రమీల తమిళనాడులోని విల్లుపురంలో ఆమె సోదరుడు సుదీంద్రన్ తో కలిసి నివాసం ఉంటోంది. గతంలో సుదీంద్రన్ ప్రముఖ నటి దగ్గర మేనేజర్ గా పని చేసి ప్రస్తతం ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా ప్రమీల, ఆమె సోదరుడు సుదీంద్రన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని తెలుస్తోంది.ఆర్థిక పరిస్థితులను ఎదిరించలేక, బతకడానిక వేరే మార్గం లేక నటి ఊర్వశి ఆడపడుచు ప్రమీల, ఆమె సోదరుడు సుదీంద్రన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో సమీప బంధువులు, చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
మా ఆత్మహత్యలకు ఎవ్వరూ కారణం కాదని, ఆర్థిక సమస్యలు, ఆనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామని, మా ఇంట్లోని విలువైన వస్తులు విక్రయించి మేము ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో వాళ్లకు, ఇంటి యజమానికి ఆ డబ్బు ఇవ్వాలని, మా శవాలకు పోస్టుమార్టం నిర్వహించకూడదని ప్రమీల, సుదీంద్రన్ డెత్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.