ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ బతుకుతుంటారు. అయితే ఈ సామాజిక మాధ్యమాలు కొందరికి ఉపాధిని కల్పిస్తుండగా.. మరికొందరి ఉసురు తీస్తున్నాయి. ఇంకొందరిని సోమరులను చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన ఉపాధి గురించి కాదులెండి.. ఓ వ్యక్తిపై జరిగిన అమానవీయ దాడి గురించి. ఈ ఘటన గురించి తెలుసుకున్నాక మీరు ఏదైనా వాట్సప్ గ్రూపునకు అడ్మిన్ గా ఉంటే మీ వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
ప్రస్తుతం వాట్సాప్ అంటే తెలియని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే మెసేజ్ లు పంపుకోవడానికి అంతా ఇప్పుడు ఈ మెసేజింగ్ యాప్ నే వాడుతున్నారు. ఈ యాప్ లో మీకు గ్రూపులు, గ్రూపు చాట్లు ఉంటాయని తెలుసు. ఈ గ్రూపులకు అడ్మిన్ ఉంటారు. అది ఒకరు లేదా ఎంత మందైనా ఉండచ్చు. అయితే ఆ అడ్మిన్ కు కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. అతను గ్రూపులో ఉన్న ఏ సభ్యుడినైనా తొలగించవచ్చు. అలా ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూపు నుంచి తొలగించాడని చావబాదారు. అక్కడితో ఆగకుండా అతని నాలుకను కూడా కోసేశారు.
ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. పుర్సింగిలోని ఓ హౌజింగ్ సొసైటీలో నివసించే వ్యక్తి ఓం హైట్స్ సొసైటి పేరిట ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశాడు. ఆ సొసైటీలో నివసించే వ్యక్తులను ఆ గ్రూపులో చేర్చారు. కొన్నిరోజుల తర్వాత ఓ వ్యక్తిని గ్రూపునుంచి తొలగించారు. అతను ఎందుకు తొలగించారని మెసేజ్ చేయగా.. రిప్లై ఇవ్వలేదు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి.. అడ్మిన్ కు కాల్ చేసి కలవాలని కోరాడు. అతను మరో నలుగురు మిత్రులతో కలిసి వెళ్లి వాట్సాప్ గ్రూపు అడ్మిన్ పై దాడికి దిగాడు.
అక్కడితో ఆగకుండా విచక్షణారహితంగా అతడి నాలుకను కోసేశాడు. బాధితుడిని గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. తెగిపడిన అతని నాలుకను వైద్యులు కుట్లువేసి అతకించారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. గ్రూపు నుంచి తొలగిస్తే నాలుక కోయడం ఏంటని వణికిపోతున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే నేను వాట్సాప్ గ్రూపు అడ్మిన్ గా ఉండను బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.