సినిమా తీసేందుకు కావల్సినంత స్టఫ్ ఉన్న క్రైమ్ స్టోరీ ఇది. ప్రేమికురాలి కోసం కాళ్ల పారాణి ఆరకముందే కట్టుకున్న భార్యను చంపేశాడు. సాధారణ మరణంలా నమ్మించే ప్రయత్నం విఫలమై కటకటాల వెనుక ఉన్నాడు. ఈ క్రైమ్ స్టోరీ ఎక్కడ జరిగింది, ఏమైందనే వివరాలు మీ కోసం..
క్రైమ్ సినిమా తీసేందుకు అవసరమైన కంటెంట్ ఉన్న ఈ స్టోరీ మరెక్కడో కాదు వరంగల్‌లో జరిగింది. పెళ్లయి నాలుగు నెలలు కాకుండానే కట్టుకున్న భార్యను చంపి సాధారణ మరణంగా మల్చేందుకు ప్రయత్నించాడు. పెళ్లాం తెచ్చిన డబ్బుతో పదో తరగతి క్లాస్‌మేట్‌తో జీవిద్దామనుకున్నాడు. కధ అడ్డం తిరగడంతో చేసిన నేరం పట్టుబడి జైళ్లో ఉన్నాడు.
మహబాబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్యతాండాకు చెందిన గణేశ్‌కు సూర్యాపేట దర్శనపల్లికి చెందిన గౌతమితో మే 18న పెళ్లయింది. కోరినంత కట్నమిచ్చి ఘనంగానే పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే అప్పటికే పదో తరగతి క్లాస్‌మేట్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. అందుకే ఆటో డ్రైవింగ్‌తో సంపాదన బాగుంటుందని చెప్పి భార్యతో సహా వరంగల్ మకాం మార్చి ఆటో కొనుక్కుని సెటిల్ అయ్యాడు. అటు పదో తరగతి క్లాస్‌మేట్‌తో ప్రేమాయణం సాగుతోంది. ఇక ఇప్పుడు భార్యని వదిలించుకుంటే లవర్‌తో హాయిగా సెటిల్ అవచ్చు.
అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేశాడు. ఆ తరువాత భార్యకు శ్వాస ఆడటం లేదని హడావిడి చేసి 108 రప్పించాడు. ఓ సాధారణ మరణంలా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ మృతురాలి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గట్టిగా తమదైన శైలిలో నిలదీసేసరికి అసలు విషయం ఒప్పుకున్నాడు. ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నాడు.
టెన్త్ క్లాస్‌మేట్‌తో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. నిందితుడు గణేశ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న అభాగ్యురాలు మాత్రం కాళ్ల పారాణి ఆరకముందే ప్రాణాలు పోగొట్టుకుంది.