అమెరికాలో లక్షల్లో జీతం కాదని గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి సొంతింటి కలను నిజం చేయడం కోసం స్టార్టప్ కంపెనీని ప్రారంభించి తక్కువ ధరకే ఇండ్లను నిర్మిస్తున్నారు ఓ మహిళ. అది కూడా వ్యవసాయ వ్యర్థాలతో ఎకో ఫ్రెండ్లీ హౌస్ లను నిర్మిస్తున్నారు.
సొంతిల్లు అనేది ఎంతో మంది కల. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటుకలు, సిమెంట్ వంటి వాటితో ఇల్లు కట్టాలంటే ఖర్చు ఎక్కువ. దానికి తోడు కాలుష్యం. పర్యావరణానికి హాని చేయకుండా వ్యవసాయ వ్యర్థాలతో కూడా ఇల్లు కట్టచ్చు అని ఒక యువతి నిరూపించారు. ఇప్పటికే అనేక మంది వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ కోవకి చెందిన యువతే శృతి పాండే. ఈమె న్యూయార్క్ లో మంచి జీతం వచ్చే ఉద్యోగం వదులుకుని మరీ ఈ సరికొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశారు. తక్కువ బడ్జెట్ లో వ్యవసాయ వ్యర్థాలతో స్థిరమైన ఇంటిని నిర్మించాలనేది ఆమె కల. ఆ కల కోసం ఆమె న్యూయార్క్ నుంచి ఇండియా వచ్చేసారు.
అమెరికాలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేశారు శృతి. కొన్ని రోజులు న్యూయార్క్ లోని ఓ సంస్థలో ఉద్యోగం చేశారు. అయితే భారత్ లోనే స్థిరపడాలి అని అనుకున్నారు. ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నారు. అలా ఇండియా వచ్చిన ఆమె ఎస్బీఐ యూత్ ఫెలోషిప్ కార్యక్రమం కింద గ్రామాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆమెకు అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ ఇల్లు అవసరం అని గ్రహించారు. అప్పుడే సామాన్యుల కోసం స్ట్రక్చర్ ఎకో అనే ఒక స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ద్వారా వ్యవసాయ వ్యర్థాలు, స్టీల్ ని కలిపి ఫైబర్ ప్యానెల్స్ ని తయారు చేస్తారు. ఈ ప్యానెల్స్ 100 ఏళ్ల వరకూ స్థిరంగా ఉంటాయి. ఈ ప్యానెల్స్ లో ఉండే సూక్ష్మ రంధ్రాలు బాహ్య వాతావరణ పరిస్థితులు మెరుగు పడేవరకూ తేమను గ్రహించి నిలుపుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో సరసమైన ధరకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె కల అని శృతి పాండే అన్నారు. రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలను సేకరించి వాటితో ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన ప్యానెల్స్ ని తయారు చేస్తున్నారు. ఈ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం అవుతుంది. అలా కాకుండా తమకు ఇస్తే రైతులకు డబ్బు కూడా ఇస్తున్నారు. 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగిన ప్యానెల్ తయారీకి 100 కిలోల గడ్డి అవసరమవుతుంది. 100 చదరపు అడుగుల ఇంటికి 15 వేల కిలోల వ్యర్థాలు అవసరమవుతాయని శృతి పాండే అన్నారు. కోవిడ్ సమయంలో బీహార్ లోని పాట్నా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్ 19 సదుపాయాల పేరుతో ఆసుపత్రులను ఈ కంపెనీ ద్వారా నిర్మించారు. అలానే లేబర్స్ కాలనీ, 70 ఏళ్ల నాటి పాఠశాల కోసం తరగతి గదులు, అలానే వంటగది, క్యాంటీన్ మరియు ఎకో ఫ్రెండ్లీ రెసిడెన్షియల్ ఇండ్లను నిర్మించారు. నాలుగు వారాల్లో ఎకో ఫ్రెండ్లీ ఇంటిని నిర్మించి ఇవ్వడం ఈ కంపెనీ ప్రత్యేకత.