‘ఉద్యోగం కన్నా వ్యాపారమ మిన్న..‘అనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలని భావిస్తే.. మీకోసం ఓ మంచి బిజినెస్ ఐడియా. అదే.. తేనెటీగల పెంపకం. ఈ వ్యాపారం ద్వారా లక్షల్లో ఆదాయాన్ని గడించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయం అందిస్తుంది. అందులోనూ ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి నగరాలకు వెళ్ళక్కర్లేదు. మీరుంటున్న గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. అలా మదిలో తట్టిన ఆలోచనను ఆచరణలో పెట్టిన ఓ భార్యాభర్తల విజయగాథ మీకోసం..
గుజరాత్‌కు చెందిన హిమాన్షు – తన్వి దంపుతులిద్దరూ ఈ వ్యాపారంలోకి రాకముందు ప్రయివేట్ ఉద్యోగాలు చేసేవారట. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన హిమాన్షు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, తన్వి టీచర్‌గా పనిచేసేదట. అయితే కొంత కాలం ఉద్యోగం చేశాక విసిగిపోయిన వీరు సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారట. అలా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారట. సేంద్రియ వ్యవసాయం అంటే తెలుసుకదా! పురుగుమందులు ఉపగించకూడదు. జీవరసాయనాలు చల్లాలి. అలా సురక్షిత ప్రత్యామ్నాయ ఎరువుల కోసం వెతుకున్న వీరికి తేనెటీగల పెంపకం గురించి తెలిసింది.
వెంటనే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వారు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడకి వెళ్లాకవారి ఆలోచనలో మార్పొచ్చింది. వారి సలహాల మేరకు నమ్మకంతో తేనె వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మొదట తమ సొంత భూమిలో హనీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో కొద్ది మొత్తంలో తేనెను తయారు చేసేవారు. అలా అంచెలంచెలుగా వ్యాపారారన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. అలా లాభాల బాటలో పయనిస్తున్న సమయంలో.. సమీపంలోని పొలాల రైతులు రసాయనిక ఎరువులు వాడడం వల్ల తేనెటీగలు చనిపోవటం ఈ జంటను చలింపచేసింది.
తేనెటీగలు మరణించటంతో ఆ దంపతులు హనీ ఫామ్ సమీపంలోని రైతులకు రసాయన ఎరువులు వాడవద్దని కోరారు. వాటికి బదులుగా సహజసిద్ధమైన ఎరువులు ఎలా వినియోగించాలో వారికి అవగాహన కల్పించారు. ఈ దంపతుల సూచన మేరకు రసాయన ఎరువుల వాడకాన్ని చుట్టుపక్కల రైతులు మానేయటంతో వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. అలా ప్రస్తుతం వీరు నెలకు దాదాపు 300 కిలోల వరకు తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. దానిని ‘స్వాధ్యా ‘ అనే బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా అమ్ముతున్నారు. నెలకు రూ.9 నుంచి రూ.12 లక్షల వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. అలా ఏడాదికి రూ.1.40 కోట్లు లాభం వచ్చినట్లు వారు వెల్లడించారు. మీరు కూడా ఈ వ్యాపారాన్ని ఎంచుకోవాలనుకున్నట్లయితే.. దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించండి.