బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతోంది. క్రిప్టో డిపాజిట్లు అధికంగా ఉన్న ఒక అతిపెద్ద బ్యాంక్‌ను క్లోజ్ చేస్తున్నట్లు నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి.
అగ్రరాజ్యం అమెరికా బ్యాంకింగ్ రంగంలో కలకలం కొనసాగుతోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఉదంతం ముగియక ముందే.. యూఎస్‌లో మరో పెద్ద బ్యాంక్ మూతపడటం సంచలనంగా మారింది. క్రిప్టో ఇండస్ట్రీతో అధిక సంబంధాలు కలిగిన సిగ్నేచర్ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు అమెరికా దేశ నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం తెలిపాయి. రెండ్రోజుల వ్యవధిలోనే అమెరికాలో రెండు కీలక బ్యాంకులు మూతపడ్డాయి. ఇలా కీలక బ్యాంకుల మూసివేత వల్ల అమెరికన్ బ్యాంకింగ్ రంగంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సిగ్నేచర్ బ్యాంకును ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సంస్థ తన నియంత్రణలోకి తీసుకుంది.
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్ బ్యాంకు.. ముఖ్యంగా స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం 9 విభాగాల్లో నాణ్యమైన సేవలందిస్తోంది. కాగా.. ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంకు పతనానికి కారణమైన వారి మీద కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ స్పష్టం చేశారు. అలాగే డిపాజిట్లు సేఫ్‌గా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఎంప్లాయీస్, చిరు వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా తాము ఒక పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు సిగ్నేచర్ బ్యాంకుపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ స్పష్టం చేసింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తగ్గకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది.