ఈ రోజుల్లో చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. రెంట్ కి, కరెంట్ కి, గ్యాస్ కి, వాయిదాలకి, ఇంటర్నెట్ కి, రీఛార్జ్ కి, సినిమాలకి, షికార్లకి ఇలా చాలా వరకూ క్రెడిట్ కార్డుల ద్వారానే స్వైప్ చేస్తున్నారు. అయితే డ్యూ డేట్ వచ్చే సమయానికి చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయానికి వారి వద్ద డబ్బు లేకపోవడమో.. ఇస్తానన్న మనిషి హ్యాండ్ ఇవ్వడమో ఏదో జరుగుతుంది. కొంతమంది మతిమరుపు వల్ల కూడా మరచిపోతున్నారు. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండడం వల్ల డ్యూ డేట్లు గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. కానీ డ్యూ డేట్ లోపు బిల్లు కట్టకపోతే వడ్డీ పడిపోతుంది. అంతేకాదు సిబిల్ స్కోర్ పై కూడా ప్రభావం పడుతుంది. మీకు తెలుసు సిబిల్ స్కోర్ పడిపోతే బ్యాంకులు లోన్లు, క్రెడిట్ కార్డులు ఇవ్వవు.
సిబిల్ స్కోర్ అనేది పడిపోతే ఆర్థిక పక్షవాతం, ఆర్థిక వైకల్యం వచ్చినట్టే. అందుకే చాలా మంది సిబిల్ స్కోర్ ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. డ్యూ డేట్ ని మర్చిపోవడమో లేక ఆ టైంకి డబ్బులు లేకపోవడమో జరుగుతాయి. ఈ క్రమంలో ఆలస్యంగా చెల్లించిన వారికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే తాజాగా ఆర్బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి ఉపశమనం కలిగించింది.క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ చేసిన వారికి 3 రోజుల వరకూ.. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. డ్యూ డేట్ కి పేమెంట్ చేయనివారికి.. 3 రోజుల గడువు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఉపశమనం లభించినట్లయింది.
క్రెడిట్ కార్డు పేమెంట్ పొరపాటున మిస్ చేసినా, ఇంకేదైనా కారణం వల్ల ఆలస్యం చేసినా గానీ 3 రోజుల వరకూ కొంచెం ధీమాగా ఉండవచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. అయితే అదనంగా ఇచ్చిన 3 రోజుల గడువు తేదీ లోపు కట్టకపోతే మాత్రం జరిమానా కట్టాల్సిందే. ఈ జరిమానా తర్వాత జనరేట్ అయ్యే బిల్లింగ్ సైకిల్ కు యాడ్ అవుతుంది. ఆలస్య చెల్లింపునకు విధించే రుసుము.. బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థ నిబంధనలను బట్టి ఉంటుంది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని బట్టి నిర్ణయిస్తాయి. అయితే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైనే లేట్ పేమెంట్ ఛార్జీలు విధిస్తాయి. మొత్తం అమౌంట్ మీద కాదని గుర్తుంచుకోవాలి.
మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే.. అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 500 నుంచి రూ. 1000 మధ్యలో ఉంటే కనుక ఆలస్య రుసుము రూ. 400 ఉంటుంది. అదే అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 1000 నుంచి రూ. 10 వేల మధ్య ఉంటే.. రూ. 750 జరిమానా పడుతుంది. అదే 10 వేల నుంచి 25 వేల మధ్యలో ఉంటే రూ. 950, 25 నుంచి 50 వేల మధ్యలో ఉంటే రూ. 1100, 50 వేలు పైన అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉండి.. డ్యూ డేట్ కి పే చేయకపోతే.. ఆలస్య రుసుము కింద రూ. 1300 వసూలు చేస్తుంది బ్యాంకు. మరి క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ మిస్ చేసిన వారికి 3 రోజులు గడువు ఇమ్మని ఆదేశించిన ఆర్బీఐపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.