ప్రభుత్వ రంగ సంస్థలో అతిముఖ్యమైన వాటిల్లో తపాల వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషించేది. మారుతున్న కాలంతో పాటు పోస్టాఫీసు తన సేవలను మార్చుకుంటూ వచ్చింది. బ్యాంకులకు ధీటుగా తన సేవలను వినియోగదారులకు అందిస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో పోస్టాఫీసు.. వినియోదారులను పెంచుకునేందుకు, తమ కస్టమర్ల కోసం అనేక కొత్త పథకాలను తీసుకవస్తోంది. అనేక రకాల పథకాలతో పోస్టాఫీసు తమ వినియోదారులకు మంచి లాభాలను అందిస్తోంది. అలాంటి పథకాల్లో “గ్రామ సుమంగళ్ రూరల్ పోస్టల్ జీవిత బీమా” పథకం ఒకటి. ఈ స్కీమ్ లో రోజుకు రూ.95 పెట్టుబడిగా పెడితే మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ.14 లక్షలు పొందవచ్చు. మరీ ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టల్ వ్యవస్థ అందిస్తున్న అనేక స్కీమ్స్ లో గ్రామ సుమంగళ్ రూరల్ పోస్టల్ జీవిత బీమా పథకం(RPLI)ఒకటి. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం పోస్టల్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఈ పథకం 1995లో ప్రారంభమైంది. ఈ స్కీమ్ లో రోజూ రూ.95 ఇన్వెస్ట్ మెంట్ తో మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.14 లక్షలు పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిదారుడి మనీ బ్యాక్ పాలసీ అనే అదనపు ప్రయోజనాన్ని మీరు పొందినట్లయితే మెచ్యూరిటీకి గడువుకు ముందే ఈ పథకం నుంచి డబ్బును పొందవచ్చు. ఈ పోస్టల్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోనునే పెట్టుబడిదారుడి వయస్సు 19 -45 సంవతర్సాల మధ్య ఉండాలి. ఈ పథకంలో పాలసీదారుడికి మెచ్యూరిటీపై బోనస్ కూడా ఇవ్వబడుతుంది.
ఈ పథకంలో రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. అందులో ఒకటి 15 ఏళ్ల, మరొకటి 20 ఏళ్ల మెచ్యూరిటీ ప్లాన్ లో ఉన్నాయి. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ప్లాన్ లో ఏదో ఒకటి కొనుగోలు చేయవచ్చు. అనుకొకుండా పెట్టుబడిదారుడు మరణిస్తే అతని నామినీ బోనస్‌తో పాటు మొత్తాన్ని డబ్బు పొందుతారు. ఇక ఈ పాలసీ వలన కలిగే ఉపయోగాల విషయానికి వస్తే… మీరు 15 ఏళ్లు లేదా 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. మీరు 15 ఏళ్ల మెచ్యూరిటీ పాలసీ తీసుకుంటే 6, 9, 12 పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున డబ్బులు వస్తాయి. మిగిలిన 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయం లభిస్తాయి. అదే మీరు 20 ఏళ్ల కాల పరిమితితో ప్లాన్ తీసుకున్నట్లైయితే..అప్పుడు 8, 12, 16 ఏళ్లలో పాలసీ టర్మ్స్ వద్ద మొత్తం డబ్బుల్లో నుంచి 20 శాతం చొప్పున తీసుకోవచ్చు.
మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయంలో పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి ఓ చిన్న ఉదాహరణతో మరింత వివరంగా తెలుసుకుందాం.. ఓ 25 ఏళ్ల వయస్సున వ్యక్తి ఈ పథకంలో పెట్టుబడి పెడితే అతను రూ.7 లక్షల హామీతో 20 ఏళ్ల ప్లాన్ లో ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రతి నెలా రూ.2853 వాయిదాగా చెల్లిస్తుండాలి. అంటే రోజుకు వచ్చేసి రూ.95 డిపాజిట్ చేయాలి. అయితే మూడు నెలలకు ఒకసారి చెల్లించాలంటే రూ.8,850, ఆరు నెలల్లో డిపాజిట్ చేయాలనుకుంటే రూ17,100 చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత, పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ.14 లక్షలు పొందుతారు.