పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే అందులో కొన్ని మార్పులు జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అదేంటన్నది ముందే తెలుసుకొని పాన్-ఆధార్ అనుసంధానం చేయడం మంచిది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ ఆ గడువును పలుమార్లు పొడిగించింది. ఇప్పుడు జూన్ 30 లోపు ఈ రెండింటిని అనుసంధానం చేయాలి. లేనియెడల అలాంటి వ్యక్తుల పాన్ కార్డులు పని చేయవు. ఈ క్రమంలోనే పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.1000 జరిమానా చెల్లించడంలో ఓ ఆప్షన్ మార్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
పాన్ కార్డను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు గతంలో మార్చి 31, 2023 వరకు గడువు ఉండేది. అందువల్ల అసెస్‌మెంట్ ఏడాదిని 2023-24గా అందరూ ఎంచుకునేవారు. అయితే, ఇప్పుడు కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభమైన నేపథ్యంలో అసెస్‌మెంట్ ఇయర్‌ను 2024-25గా ఎంచుకోవాలి. పెనాల్టీ చెల్లించే సమయంలో టైప్ ఆఫ్ పేమెంట్‌ను అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ మార్పు గమనించకుండా పెనాల్టీ చెల్లిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.