బుల్లితెరపై ఎన్నో షోలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. కానీ వాటిల్లో కొన్నిమాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొడతాయి. అలా అభిమానుల హృదయాలను దోచుకున్న షో ‘బిగ్ బాస్’. గత ఐదు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ఈ షో తాజాగా ఆరో సీజన్ కు ముగింపు పలికింది. బిగ్ బాస్ సీజన్ 6 కు మెుదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఆదివారం జరిగిన బిగ్ బాస్ 6 ఫినాలేలో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.. విజేతగా నిలిచి ట్రోఫీని గెలిచిన రేవంత్ కు రూ.10 లక్షలు వస్తే.. రన్నరప్ గా నిలిచిన శ్రీహాన్ కు మాత్రం రూ. 40 లక్షలు వచ్చాయి. అదేంటి అలా ఎలా? ఇస్తారు అని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ సీజన్ 6లో మెుత్తం 21 మంది కంటెస్టెంట్ లు పోటీపడ్డారు. కానీ టాప్ 5లో మాత్రం సింగర్ రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి భట్, రోహిత్ లు నిలిచారు. ఇక తాజాగా ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో సింగర్ రేవంత్ బిగ్ బాస్ 6 విన్నర్ గా అవతరించాడు. మరోవైపు రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మెుదట రోహిత్, తర్వాత ఆదిరెడ్డి ఎలిమినేట్ అవ్వగా.. మూడో వ్యక్తిగా హౌజ్ నుంచి బయటకి వచ్చింది కీర్తి భట్. ఈ సందర్భంగా బంగారు సూట్ కేస్ తో హౌజ్ లోకి అడుగుపెట్టారు కింగ్ నాగార్జున.
రేవంత్ కు, శ్రీహాన్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీలో సగాన్ని తీసుకుని హౌజ్ నుంచి వెళ్లిపోవచ్చని సూచించాడు. కానీ దానికి ఇద్దరు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాగ్ ఆ ప్రైజ్ మనీని రూ. 30లక్షలకు పెంచారు. అప్పుడు కూడా ఇద్దరు అంగీకరించలేదు. చివరికి ఆ మెుత్తాన్ని రూ. 40 లక్షలకు పెంచడంతో శ్రీహాన్ ఆ మెుత్తాన్ని తీసుకున్నాడు. దాంతో బిగ్ బాస్ 6 విజేతగా రేవంత్ నిలిచాడు. రేవంత్ కు బిగ్ బాస్ 6 ట్రాఫీతో పాటుగా విజేతగా నిలిచినందుకు రూ. 10 లక్షలు గెలుచుకున్నాడు. కానీ రన్నర్ గా నిలిచినందుకు గాను శ్రీహాన్ రూ. 40 లక్షలు గెలుచుకోవడం ఇక్కడ గమనార్హం.