ఇనయా సుల్తానా అలియాస్ ఫైర్ లేడీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో ఈమెకు కావాల్సినంత పేరు వచ్చింది. సీజన్ మొత్తంలో గీతూ రాయల్, ఇనయా సుల్తానాలకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. వీళ్ల గేమ్, గొడవలతో హౌస్ మొత్తంలో నానా రచ్చ చేశారు. గీతూ రాయల్ ఎలిమినేట్ అవ్వడంతో.. ఇనయాకు ఇంకా మంచి స్కోప్ వచ్చింది. ఆఖరి వారంలో కెప్టెన్ అయ్యి మొదటి సెమీఫైనలిస్ట్ అయిన ఇనయా సుల్తానా.. అనూహ్యంగా 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ సమయంలో ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని నిరసనలు కూడా తెలిపారు. తొలుత నెగిటివిటీ మూటగట్టుకుని ఆ తర్వాత సింగిల్ గా సివంగిలా మారింది.
హౌస్ లో ఈమెకు లవ్ ట్రాక్ కూడా నడిపారు. ఆర్జే సూర్యాకి ఇనయాకి ఏదో ఉంది అంటూ సీన్లు, సాంగ్లు, ప్రోమోలతో హోరెత్తించారు. ప్రోమోలకు ఉపయోగపడేలా వాళ్లు కూడా బాగానే కంటెంట్ ఇచ్చారు. ఇద్దరూ ఒకే దగ్గర కూర్చోవడం, కలిసి గేమ్ ఆడటం ఇలా చాలానే చేశారు. సూర్య అంటే నాకు క్రష్ ఉంది అని ఇనయా నేరుగా బిగ్ బాస్ కే చెప్పింది. ఆ తర్వాత ఆ విషయాన్ని సూర్యాకి, ఇంట్లోని సభ్యులకు కూడా చెప్పుకొచ్చింది. అయితే వీళ్ల మధ్య ఏదో మొదలవుతోంది అనుకునే సమయానికి సూర్య హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా ఇనయా సుల్తానా నామినేట్ చేసిన వారమే ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఆమెకు నెగిటివ్ అయ్యింది.
హౌస్ మొత్తం సూర్యమీద నీకు ప్రేమ లేదు అంతా నటన అంటూ కామెంట్స్ కూడా చేశారు. అవన్నీ పట్టించుకోకుండా ఇనయా మాత్రం సూర్య కప్పులు, ప్లేట్లతో కాలం గడిపేసింది. ఇంకేముంది ఇనయా సుల్తానా బయటకి రాగానే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతారని అంతా అనుకున్నారు. కానీ, ఇనయా మాత్రం సూర్యకి హ్యాండిచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ 4 టాప్-3 కంటెస్టెంట్ సోహెల్ కి ఇనయా లవ్ ప్రపోజల్ చేస్తూ కనిపించింది. రెడ్ డ్రెస్ లో గులాబీ చేత్తో పట్టుకుని మోకాళ్లపై కూర్చొని సోహెల్ మీరంటే నాకిష్టం.. ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది. ఇది చూసి సూర్య, బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా ఆర్జే సూర్యాకి హ్యాండిచ్చావా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇదంతా ఒక ప్రమోషనల్ వీడియో అని తెలుస్తోంది. సోహెల్ ప్రస్తుతం హీరోగా బిజీగా మారిపోయాడు. అతను నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ప్రమోషన్ కోసమే ఈ వీడియో చేసినట్లు చెబుతున్నారు. అలాగే ఇటీవల ఇనయా సుల్తానా కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఈ వీడియో తన ఛానల్ లో వేసుకుంటే ఛానల్ కి కూడా ప్రమోషన్ అవుతుందని భావించి ఇలా చేసుంటారని చెబుతున్నారు. లక్ష్మీ లక్షణ్ మాత్రమే కాకుండా సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.