తరతరాలుగా, యుగయుగాలుగా కొందరు పెద్దలు ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రేమ జంటలను పెళ్లి పీటలపైకి ఎక్కనివ్వకుండా అడ్డుపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రేమ జంట విషయంలోనూ ఇలానే జరిగింది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. పెద్దల పంచాయతీ జరిగినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఒకరు గొప్ప మనసు చాటుకున్నారు. ఇరు కుటుంబాల వారిని, గ్రామ పెద్దలను ఒప్పించారు. ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి చేశారు. అది కూడా పార్టీ ఆఫీసులో. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని లక్ష్మీ నరసాపురానికి చెందిన దుర్గా మల్లేష్, విజయ అనే యువతీయువకులు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరూ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. గ్రామ పెద్దలతో పంచాయతీ కూడా జరిగింది. అయినా లాభం లేకుండా పోయింది. పెద్దలు వారిపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. తమ ప్రేమను కొనసాగించారు. పెద్దల కారణంగా పెళ్లి చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్న ప్రేమ జంట గురించి అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి తెలిసింది. వారి ప్రేమ కథ తెలుసుకుని ఆయన చలించిపోయారు. తానే దగ్గరుండి వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.
గ్రామ పెద్దలతో పాటు ఇరు కుటుంబాల వారిని ఒప్పించారు. పార్టీ ఆఫీసులో పెద్దల సమక్షంలో వారికి పెళ్లి చేశారు. దుర్గా మల్లేష్, విజయలు తమను కలిసిన ఎమ్మెల్యే కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మంచి మనుసును నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రేమ జంటకు శుభాకాంక్షలు సైతం తెలియజేస్తున్నారు. మరి, ప్రేమ జంటను పార్టీ ఆఫీసులో ఒక్కటి చేసిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.