విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కార్మికులు భయపెడుతున్నాయి. తాజాగా మరోసారి జరిగిన ప్రమాదంతో అక్కడ భయాందోళనకర వాతావరణం నెలకొంది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 సీసీడీ విభాగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ స్లెడ్ గేట్ సరిగ్గా మూతపడకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ల్యాడిల్ గేట్ తెరుచుకుని ఉండటంతో దానిలో ఉన్న అధిక ఉష్ణోగ్రత కలిగిన ఉక్కుద్రవం కింద ఒలికి నేలపాలైంది. తీవ్రమైన వేడితో కూడిన ఉక్కుద్రవం ఒకేసారి బయటకు ప్రవహించడంతో.. అక్కడే ఉన్న కార్మికులు భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే ఎస్‌ఎంఎస్-1 విభాగానికి చెందిన ల్యాడిల్ పేలిపోయి కార్మికులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన మరువక ముందే.. మళ్లీ అదే స్థలంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కార్మికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈసారి ప్రమాదాన్ని ముందుగానే గమనించి అప్రమత్తమవ్వడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో కార్మికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్లాంట్ భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ప్రమాదం వల్ల ఆ విభాగంలో ఉత్పిత్తి నిలిచిపోయింది. అక్కడ విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు భయపడిపోతున్నారు. SMSలోని కంటిన్యూ కాస్టింగ్ విభాగంలో ఆరు మెషీన్లు ఉంటాయి. అందులో ఐదు నిత్యం పనిచేస్తుంటాయి. ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ‘బి’ షిఫ్ట్‌లో 2, 3, 4 మెషీన్లు పనిచేస్తున్నాయి.
2వ మెషీన్ వద్ద జరిగిన ప్రమాదం వల్ల మొత్తం విభాగంలోని కేబుళ్లు, ఇతర యంత్ర సామగ్రి ధ్వంసమయ్యాయి. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది
చాలాసేపటి వరకు ఈ విభాగంలో ఉత్పత్తి పునఃప్రారంభం కాలేదు. ఈ ప్రమాదంతో మెషీన్ల వద్ద పని చేసేందుకు ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ విభాగంలో ఉత్పత్తి నిలిచిపోవడంతో మిగిలిన విభాగాల్లోనూ ఉత్పత్తి ప్రక్రియపై ప్రభావం పడింది. దీంతో సంస్థకు కోట్ల రూపాయల్లో నష్టం వచ్చే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు.
