ఇపుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. డబున్నవారిదే ఆరోగ్యం అయిపోయింది. పేదవాడికి వైద్యం అందాలంటే గగనం అయిపోయింది. అయితే జగన్ ఇప్పుడు ప్రతీ పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రజలకు జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ ప్రజల ఆరోగ్యం కోసం ఒక ఫ్యామిలీ డాక్టర్ ను కేటాయించారు. ప్రతీ గ్రామానికి ఒక విలేజ్ క్లినిక్ ను ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పూర్తిగా ప్రజల సంక్షేమం పైనే దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ఆయన మరింత ఫోకస్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన జగన్.. పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నత చదువు అందించడమే లక్ష్యంగా అమ్మఒడి సహా పలు పథకాలను అమలు చేస్తున్నారు.ఇక వైద్య రంగంలో కూడా సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు. వైద్యం ఎంత ఖరీదైనదైనా గానీ పేదవాడికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా అనేక మందికి లబ్ది చేకూరేలా చేసిన జగన్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.
వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అదే రోజున ఒక్కో విలేజ్ లో ఒక విలేజ్ క్లినిక్ ను ప్రారంభించనున్నారు. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకూ 45,90,086 మందికి ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందించింది. ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు జగన్ కి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1149 పీహెచ్సీల్లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించినట్లు అధికారులు వివరించారు.
అలానే దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా పీహెచ్సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, అందుకోసం అదనపు నియామకాలు కూడా చేశామని చెప్పారు. అలానే ప్రతీ జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రతీ 6,7 పీహెచ్సీలకు ఒక వైద్యుడ్ని అదనంగా నియమించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మందిని రిజర్వ్ లో పెట్టుకున్నామని, 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ఒక్కో క్లినిక్ కి ఒక ఏఎన్ఎం చొప్పున ఉంటారని అన్నారు. వీరితో పాటు ఒక సీహెచ్ఓ, 3 లేదా నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటారని అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్, అలానే 104 లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు.
అవసరమైన అన్ని రకాల మందులు ఉండాలన్న లక్ష్యంతో ఇప్పటివరకూ ఇస్తూ వచ్చిన 67 రకాల మందులను 105కి పెంచినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్లను కూడా విలేజ్ క్లినిక్స్ లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ముందు ఆరోగ్యం బాగుంటే ఆ తర్వాత సంపద పెంచుకోవచ్చు. అసలు ఆరోగ్యం అనేది బాగుంటే సంపద అనేది ఆవిరైపోదు. ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కంటే మించిన సంపద ఇంకెక్కడుంటుంది చెప్పండి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా విలేజ్ క్లినిక్ కి వెళ్తే ఉచితంగా మందులు, పరీక్షలు అన్నీ చేస్తారు. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యం అందిస్తుంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఈరోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే ఆస్తులు పోగేసుకున్నట్టే. మరి వైద్యానికి పెద్దపీట వేసిన జగన్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.