ఆర్టీసీ బస్ తన స్కూటీకి డాష్ ఇచ్చిందనే కారణంతో.. బస్సులోకి ఎక్కి, డ్రైవర్ పై ఓ మహిళ దాడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు మహిళపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడమే కాక.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు కూడా మహిళ చేసిన పనిని కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. దీంతో.., ఇప్పుడు అంతా ఊహించినట్టే విజయవాడ పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమె గురుంచి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విజయవాడ, కృష్ణలంకలోని తారక రామ నగర్‌లో నివసిస్తున్న 28 ఏళ్ల కె. నందిని అనే యువతి ఈ దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఆమె కొబ్బరికాయల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక సాధారణ మహిళ.. విధుల్లో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అంత దారుణంగా దాడి చేయడం సంచలనం సృష్టించింది.ఘటన జరిగిన సమయంలో ఆమె రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఆమె స్కూటీకి చిన్నగా డాష్ ఇవ్వడం జరిగింది. ఇవేం పట్టించుకోని మహిళ.. ఆగ్రహంతో బస్సులోకి ఎక్కి డ్రైవర్ ని చితకబాదింది. దాడి సమయంలో డ్రైవర్ ముసలయ్య (42).. AP 11 Z 7046 గల బస్సు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : బస్ డ్రైవర్ పై దాడి చేసిన మహిళకు పడిన శిక్ష.. ఇదే!
డ్యూటీలో ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ, దాడి చేసిన నందినిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు అయ్యింది. అయితే.. సదురు యువతిని రిమాండ్ కి పంపకుండా, సెక్షన్ 41 ద్వారా స్టేషన్ బెయిల్ ఇచ్చి, అబ్జర్వేషన్ లో మాత్రమే ఉంచారు. ఒకవేళ కోర్టు వాదనలలో నందిని తప్పు చేసినట్టు తేలితే మాత్రం ఆమెకి మూడేళ్ళ వరకు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపల నందిని కేసులోని సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినా.., స్టేషన్ బెయిల్ రూల్స్ అతిక్రమించినా ఆమెను ఏ క్షణమైనా రిమాండ్ కి పంపవచ్చని సమాచారం.