వంగవీటి మోహన రంగా.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ప్రస్తావన వచ్చినపుడు ఈ పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం ఏపీ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సత్తా ఉన్న నాయకుల్లో రంగా ఒకరు. ఆయన చనిపోయి 34 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఆ పేరులోని వైబ్రేషన్స్ ఏ మాత్రం తగ్గటం లేదు. నిజం చెప్పాలంటే ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆయన క్రేజ్ పెరుగుతూ పోతోంది. కేవలం ఓ వర్గం, ప్రాంతం వాళ్లే కాదు.. తెలుగు రాష్ట్రాలోని కొన్ని లక్షల మందికి ఆయన ప్రియతమ నాయకుడు. కొంతమందికి గుడిలేని దేవుడు కూడా. ఓ సాధారణ ఎమ్మెల్యేకు ఇంత క్రేజ్ ఎందుకు? ఇదంతా ఎలా సాధ్యం అయింది?
గుణం లోంచి.. జనం లోంచి వచ్చిన నాయకుడు
ప్రస్తుత రాజకీయాలు.. రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, అప్పట్లో రాజకీయం అనే పదానికే రంగా ఓ కొత్త అర్థాన్ని ఇచ్చారు. నాయకుడంటే ఇలా ఉండాలిరా అనిపించుకున్నారు.. ఇప్పటికీ అనిపించుకుంటూనే ఉన్నారు. 1980లలో రంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే పదవిని ఆయన కేవలం ప్రజల కష్టాలు తీర్చటానికి మాత్రమే వాడుకున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేరుగా రంగంలోకి దిగేవారు. అవినీతికి ఆమడ దూరంలో ఉండేవారు.
అప్పట్లో ఆయన ఇంటి ముందు రిక్షాలు, ఆటోలు కుప్పలు తెప్పలుగా ఉండేవి. వందల సంఖ్యలో జనం తమ కష్టాలు చెప్పుకోవటానికి ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆయన అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వారి సమస్యలు వినేవారు. వినటమే కాదు.. ఆ సమస్యలను పరిష్కరించేవారు. అవసరమైతే నేరుగా రంగంలోకి దిగేవారు. ఆయన గొప్పతానన్ని చాటిచెప్పే వార్తలు, వీడియోలు, ఆడియోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినపుడు రంగా శాంతియుతంగా పోరాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గాంధేయవాదాన్ని బాగా నమ్మేవారు. చాలా సమస్యల్ని నిరాహార దీక్షలు చేసి పరిష్కరించారు.
ప్రభుత్వంలో చలనం వచ్చేలా చేశారు. అంతేకాదు! పుట్టిన కులాన్ని అభిమానించు.. పక్క కులాలను గౌరవించు అన్న పాలసీని రంగా ఫాలో అయ్యారు. ఆయన దగ్గర అన్ని కులాలు, మతాల వారు ఉండేవారు. అందరికీ ఆయన సాయం చేసేవారు. ఓ సారి కాపునాడు సభను నిర్వహిస్తే.. దాదాపు ఐదు లక్షల మంది ఆ సభకు హాజరయ్యారు. వారిలో ఆయన కులానికి సంబంధించిన వారే కాదు.. మిగిలిన చాలా కులాలు, మతాల వాళ్లు కూడా ఉండటం విశేషం. ప్రజలను కదిలించటంలో.. చైతన్యం చేయడంలో రంగా మార్కు ఎప్పటికీ ఆదర్శప్రాయమే..
చివరి శ్వాస కూడా ప్రజల కోసమే..
ప్రజా నాయకుడు అన్న పేరును రంగా సార్థకం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల కోసమే పోరాడారు, చివరకు ప్రజల కోసం పోరాడుతూనే ప్రాణాలు విడిచారు. ఏదైనా సమస్య అంత సులభంగా పరిష్కారం కాకపోతే నిరాహార దీక్షకు దిగటం ఆయనకు అలవాటు. 1988లో పేదలకు ఇళ్ల పట్టాలు పంచే విషయంలో రంగా చాలా పట్టుదలతో ఉన్నారు. తన ప్రాణాలకు అపాయం ఉందని తెలిసినా తాను అస్త్రంగా భావించే గాంధేయవాదమైన నిరాహార దీక్షకు దిగారు. ఎంత మంది చెప్పినా రంగా పట్టించుకోలేదు. కేవలం ప్రజల సమస్యను పరిష్కరించటానికి మాత్రమే ఆలోచించారు. పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించిన నిరాహార దీక్షలో ఉండగానే హత్యకు గురై ప్రాణాలు విడిచారు.
రాజకీయాలను శాసిస్తున్న అమరుడు
రంగా మరణించి నేటితో 34 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. మరణం తర్వాత కూడా ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. కేవలం విజయవాడలోనే కాదు.. మొత్తం రాష్ట్ర రాజకీయాలను ఆయన ప్రభావితం చేస్తున్నారు. రాష్ట్రంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా.. ప్రజా నాయకుడిగా ఆయనకు సాధారణ ప్రజల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే అన్ని పార్టీల వారు రంగా వర్గాన్ని( ఇక్కడ వర్గం అంటే కులం.. సామాన్య జన బలం) ప్రసన్నం చేసుకోవటానికి చూస్తూ ఉంటారు.