ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదు. వాహనాలతో అడ్డదిడ్డంగా వెళ్లడం.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం.. చలానాలు కట్టకుండా తిరగడం లాంటి ఘటనలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 47 పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న ఓ వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. చలానా లిస్ట్ తీస్తే చాంతాడంత రావడంతో వెంటనే కట్టాలని పోలీసులు ఆదేశించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న చలాన్లన్నింటిని కట్టి వాహనదారుడు బండిని విడిపించుకున్నాడు. ఈ సంఘటన ఏపీలోని తూర్పుగోదావరి జల్లా కాకినాడలో చోటుచేసుకుంది.
ట్రాఫిక్ అధికారుల ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మెయిన్ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనదారుడి బైక్ ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా ఒకటి రెండు కాదు ఏకంగా 47 పెండింగ్ చలానాలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ పెండింగ్ చలానాలకు ట్రాఫిక్ పోలీసులు ప్రింట్ కొట్టగానే రసీదుల మిషన్ నుంచి 40 అడుగుల పొడవుతో చలానాల లిస్ట్ వచ్చింది. ఇంత పెద్ద లిస్టు ఆగకుండా రావడంతో అక్కడ ఉన్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. నాలుగైదు చలానాలకే పోలీసులు వాహనాలు సీజ్ చేస్తారు. కానీ పోలీసులు కళ్లుగప్పి47 చలానాలు కట్టకుండా తిరుగుతున్నాడు వాహనదారుడు. దీంతో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పెండింగ్ చలానాలు ఉంటే చర్యలు తప్పవని ట్రాఫిక్ సిబ్బంది హెచ్చరించారు.