చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో తమ్ముళ్ళిద్దరూ శరత్ బాబుతో గొడవపడి ఓమిని వ్యాన్ లో వెళ్తుండగా.. స్కార్పియో కార్ గుద్దితే గాల్లో ఎగిరి కింద పడుతుంది. దాదాపు ఇలాంటి సీనే ఒకటి నిజ జీవితంలో చోటు చేసుకుంది. తిరుపతి సమీపంలో రేణిగుంట-చిత్తూరు బైపాస్ రోడ్డు మీద బెంజ్ కారు ఒక ట్రాక్టర్ ని ఢీ కొట్టింది. కేఏ 04 ఎంయు 3456 నంబర్ గల బెంజ్ కారు.. తిరుపతి నుంచి చిత్తూరు వేగంగా వస్తోంది. ఆ సమయంలో ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వస్తోంది. యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ట్రాక్టర్ ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ నుంచి విడిపోయి రోడ్డు మీద బోల్తా పడింది. బెంజ్ కారు వేగానికి ట్రాక్టర్ ఇంజిన్ భాగం రెండు ముక్కలైంది.
చిన్న టైర్లు ఉండే కొన ఒక వైపు, పెద్ద టైర్లు ఉండే కొన మరొక వైపు పడ్డాయి. ట్రాలీ, ట్రాక్టర్ ముందు భాగం రెండూ రోడ్డుపై తలకిందులుగా, రోడ్డుకి అడ్డంగా పడి ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాసేపటికి ట్రాక్టర్ ను పక్కకి తొలగించడంతో యధావిధిగా వాహన రాకపోకలు సాగాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కి స్వల్ప గాయాలు కాగా.. బెంజ్ కారులో ఉన్న వారు మాత్రం క్షేమంగా బయట పడ్డారు. అయితే బెంజ్ కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. బెంజ్ కారు ఎడమ వైపు ముందు భాగం కొంత దెబ్బతింది. ఘటన జరిగిన సమయంలో బెంజ్ కారు వేగం 100 నుంచి 120 కిలోమీటర్లు ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. అయితే బెంజ్ కారు గుద్దితే.. ట్రాక్టర్ రెండు ముక్కలవ్వడం మాత్రం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అంటున్నారు.