తిరుమలలో మూడేళ్ల చిన్నారిపై చిరుతపులి దాడి చేసింది. బాలుడి మెడ పట్టుకొని అడవిలోకి ఈడ్చుకెళ్లింది.
తిరుమలలోని అలిపిరి నడక మార్గంలో చిరుత పులి హల్చల్ చేసింది. ఒక బాలుడిపై దాడి చేసి అడవిలోకి ఈడ్చుకెళ్లింది. నడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తిను బండారాలు కొనుక్కునేందుకు ఒక షాపు దగ్గరకు వెళ్లి వస్తున్న టైమ్లో ఆదోనికి చెందిన కౌశిక్ అనే మూడు సంవత్సరాల బాలుడిపై చిరుత అటాక్ చేసింది. చిన్నారితో పాటు అతడి తాత, భక్తులు బిగ్గరగా కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో పులిని వెంబడించారు. దీంతో దాదాపు 150 మీటర్ల దూరంలో చిరుత ఆ చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. అయితే అడవిలో ఏడుస్తున్న బాలుడ్ని గుర్తించిన పోలీసులు.. అతడ్ని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. చిరుత దాడిలో చిన్నారి తలకు, మెడకు తీవ్ర గాయాలయ్యాయి.
చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ ఇంకా స్పృహలోనే ఉన్నాడని అధికారులు తెలిపారు. ఆ బాలుడ్ని తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పారు. చిరుత అటాక్లో గాయపడిన బాలుడ్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు. బాలుడి ప్రాణాలకు ఎలాంటి హాని లేదని చెప్పారు. హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ చిన్నారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిపారు. నడక మార్గంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. కాగా, బాలుడిపై దాడికి దిగిన చిరుత సంచరిస్తున్న ఏరియాలో భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు.