కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీళ్లు తమ బంధువులతో కలసి తిరుపతికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చాపాడులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనూష, ఓబుళమ్మ, రామలక్ష్మి చనిపోగా.. గాయపడిన వారిని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న టెంపో టైరులో గాలి తక్కువగా ఉండటంతో ఆపే క్రమంలో నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడని సమాచారం. టెంపో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్‌లో మృతి చెందిన ముగ్గురు మహిళలు ప్రొద్దుటూరుకు చెందినవారే. గాయపడినవారు అనంతరపురం, హైదరాబాద్‌కు చెందిన బంధువులుగా పోలీసులు గుర్తించారు. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.