నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తొక్కిసిలాటలో.. ఐదుగురు కార్యకర్తలు అక్కడికక్కడే చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరో ముగ్గురు మృతి చెందారు. దాంతో ఈ ఘటనలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. ఈ ఘటన మరవకముందే మరో విషాదం చోటు చేసుకుంది. గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆ వివరాలు..
గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. టీడీపీ నేతలు.. ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టారు. సుమారు 30 వేల మందికి.. కానుకలు ఇవ్వాలని నిర్వాహకులు భావించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయి.. ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కానుకల పంపిణీ మొదలుపెట్టారు. ఈ క్రమంలో జనాలు చంద్రన్న కానుకల కోసం తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురైయ్యారు. మృతి చెందిన ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. గాయపడ్డవారిని గుంటూరు జీజీహెచ్, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిసుత్న్నారు.
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. బాధితులను పరమార్శించేందుకు.. ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చారు. బాధితులతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు ప్రచార యావ వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళల మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు.. పార్టీ తరఫున వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. అలానే జరిగిన ప్రమాదంపై ఉయ్యూరు ఫౌండేషన్ స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల సాయం ప్రకటించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారి.. పూర్తి వైద్య ఖర్చులు తామే భరిస్తామని ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు. ఇక రోజుల వ్యవధిలో చంద్రబాబు సభలో తొక్కిసిలాట కారణంగా ముగ్గురు మృతి చెందడం విషాదకరం. మరి నిజంగానే చంద్రబాబు ప్రచార యావ కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటన్నాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.