తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓవైపు ముదురుతున్న ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. దేశంలోని మధ్య ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు, విజయవాడలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలో మరికొన్నిరోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. విశాఖలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 19న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 20న వాయుగుండంగా, 21న తుపానుగా మారి 23న బంగ్లాదేశ్, మయన్మార్ పరిసరాల్లో తీరం దాటొచ్చని తెలిపారు.
ఎండ తీవ్రత భారీగా ఉండే ప్రమాదముందని హెచ్చరించారు. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తున్నారు. వేసవి ప్రారంభం కావటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అధికంగా నీళ్లు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక డీహెడ్రేషన్కు గురి కాకుండా కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.