తెలుగుదేశం పార్టీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల జోగిరాజు అలియాస్ రాజా కన్నుమూశారు. తీవ్ర నొప్పితో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ వరుపుల జోగిరాజు(47) శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. శనివారం రాత్రి తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆయన మంచి పేరుంది. మూడు జిల్లాల్లో ప్రజలకు సుపరిచితుడైన జోగిరాజు(రాజా) మరణంతో పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా ఉన్న జోగిరాజు.. గతకొద్ది రోజులుగా ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి తమ పార్టీ మద్దుతు ఇచ్చే అభ్యర్థి విజయానికి తీవ్ర కృషి చేస్తూ.. పార్టీ శ్రేణులను సమయాత్తం చేశారు. శుక్రవారం వరకు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్న రాజా.. శనివారం కుటుంబసభ్యులు, ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ నేతలను కలిసేందుకు ప్రత్తిపాడుకు బయలుదేరారు. తుని సమీపంలో జాతీయ రహదారిపై ఓ హోటల్‌లో అనుచరులతో మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం. సాయంత్రం ప్రత్తిపాడు చేరుకున్నారు. ఇంటి వద్ద రాత్రి 7 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువులతో మాట్లాడారు.
కొద్దిపేపటి తర్వాత గుండెల్లో నొప్పితో కాస్త అసౌకర్యంగా అనిపించడంతో ఆయన ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆయనను హుటాహుటిన ఆయన అనుచరులు కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించినట్లు అనుచరులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ రాజా కన్నుమూశారు. 1976 ఆగస్టు 14న జన్మించిన రాజా బీకామ్ వరకు చదువుకున్నారు. ఆయనకు భార్య సత్యప్రభ, పిల్లలు మాధురి, తర్షిత్ ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో 2004లో పాలిటిక్స్‌లోకి వచ్చిన రాజా డీసీసీబీ చైర్మన్‌గా, ఆప్కాబ్‌వైస్ ఛైర్మన్‌గా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని పార్టీ నేతలు, కార్యకర్తలు విలపిస్తున్నారు.
టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం – TDP senior leader Varupula Raja passed away #NTVTelugu #NTVNews #TDP #VarupulaRaja pic.twitter.com/KBoZDpBl53
— NTV Telugu (@NtvTeluguLive) March 5, 2023