టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామునే సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు.. నకిలీ డాక్యుమెంట్లుగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపిసి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయ్యన్నపాత్రుడు, కుమారుడు రాజేష్ ఇద్దరిని ఏలూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.