వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందరికి నాణ్యమైన విద్యను అందించడం కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నేడు అవి మంచి ఫలితాలు ఇవ్వడమే కాక.. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందుతున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ఏపీ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు..
అన్నిదానాలోకెల్లా విద్యా దానం గొప్పది అంటారు. అన్నదానం చేస్తే.. ఆపూట కడుపు నిండుతుంది. అదే విద్యా దానం చేస్తే.. ఆ వ్యక్తి కడుపు నింపడమే కాక.. తానే మరో పది మందికి జీవితాన్ని ఇస్తాడు. మన జీవితాల్లో చదువుకు అంత ప్రాధాన్యత ఉంది. అయితే ప్రస్తుత కాలంలో చదువకునే రోజులు పోయి.. కొనే రోజులు వచ్చాయి. ఇప్పుడు నాణ్యమైన విద్య కావాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఎల్‌కేజీ సీటు కోసం కూడా రాజకీయ నాయకుల రికమెండేషన్, లక్షల్లో డొనేషన్లు అడుగుతున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి పెట్టుబడి, పలుకుబడి లేని పేదవారి పరిస్థితి ఏంటి.. వారి బిడ్డలకు నాణ్యమైన విద్య ఎలా అందాలి.. ఇలాంటి ప్రశ్నలే ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తొలిచి వేశాయి. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చినవే విద్యా వ్యవస్థలే సమూల మార్పులు.
పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలన్నదే ఏపీ సీఎం జగన్ సంకల్పం. ఆ దిశగా ఆయన అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాక.. ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక అత్యాధునిక వసుతలు కల్పించారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా విద్యార్థులు చదువకు దూరం కాకూడదనే ఉద్దేశంతో.. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం పౌష్టికాహారం అందజేస్తున్నారు. 8 వ తరగతి, ఆపై క్లాస్‌ల విద్యార్థులకు ట్యాబ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, షూస్, బుక్స్ అన్ని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తోంది.
విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకువచ్చిన మార్పులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై విదేశాల అధ్యక్షులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ఏపీ విద్యావ్యవస్థ భేష్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఏపీలో పథకాలు.. మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పులు.. అద్భుతమని ప్రశంసించారు స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నాజియో క్యాసిస్. జెనీవాలో ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ కార్యక్రమానికి ఇగ్నాజియో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ అందర్ని ఆకట్టుకుంది. స్వయంగా స్విట్జర్లాండ్ దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఇగ్నాజియో ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు కురిపించడం విశేషం. కరోనా సమయంలో చాలా దేశాలు విద్యారంగంలో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.. ఇప్పటికి కూడా వాటి నుంచి బయటపడలేకపోతుంటే.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని ప్రశంసించారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని ప్రశంసించారు. మరీ ముఖ్యంగా.. రాష్ట్రంలోని పాఠశాలల రూపు రేఖల్ని మార్చేస్తూ తీసుకొచ్చిన నాడు-నేడు కార్యక్రమం.. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా అద్భుతంగా తీర్చి దిద్దారని మెచ్చకున్నారు ఇగ్నాజియో.
రాష్ట్రంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చడం ప్రశంసనీయమన్నారు ఇగ్నాజియో క్యాసిన్. ఏపీ విద్యార్థులు రాబోయే రోజుల్లో కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని, ప్రతిభావంతులుగా నిలుస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. అలానే స్విట్జర్లాండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ ఆంధ్రప్రదేశ్ స్టాల్‌ను సందర్శించారు. ఏపీలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల గురించి దన్జీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా నాడు-నేడు కార్యక్రమం వివరాలను ఆసక్తిగా విన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.