శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ యువశక్తి పేరిట సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివేకానంద జయంతి సందర్భంగా యువతను ఉద్దేశించి ఈ సభను నిర్వహిస్తున్నారు. మన యువత- మన భవిత పేరిట ఈ సభను నిర్వహిస్తున్నారు. జనసేన నిర్వహిస్తున్న ఈ సభ వద్ద జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గుండెపోటుతో కుప్పకూలిన కార్యకర్తకు జనసైనికులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
రణస్థలం యువశక్తి సభకు ఒక పెద్దాయన వచ్చాడు. ఉన్నట్లుండి ఆయన కుప్పకూలాడు. అది గమనించిన యువకులు, కార్యకర్తలు ఆయనను కింద పడుకోబెట్టి గాలి వచ్చేలా చేశారు. తర్వాత ఒక యువకుడు ఆయనకు సీపీఆర్ చేశాడు. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసి.. అతడిని చేతులతో మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. జనసేన కార్యకర్తలు సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆయన ప్రాణాలు కాపాడారని చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యువశక్తి సభ విషయానికి వస్తే.. ఏ సభ చూసినా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే అంతా వింటూ ఉంటారు. కానీ, యువతకు అవకాశం ఇచ్చి.. వారి ఆలోచనలు, ఆశయాలను తెలుసుకోవాలంటూ ఈ సభకు శ్రీకారం చుట్టారు. రాజకీయంగా జనసేన పార్టీ కీలకంగా మారుతున్న తరుణంలో ఈ సభలో పవన్ కల్యాణ్ ఏం వ్యాఖ్యలు చేస్తారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భవిష్యత్ ప్రణాళికలు, పొత్తులపై క్లారిటీ ఇస్తారంటూ చాలా మంది భావిస్తున్నారు.