ఆ మధ్య లాక్ డౌన్ పుణ్యమా అని చాలా మంది టాలెంట్ బయటపడింది. జీవితంలో ఒక్కసారి కూడా గరిటె పట్టుకోని వారు వంటల్లో సిద్ధహస్తులయ్యారు. తమ అభిరుచులకు తగ్గట్టు వారి వారి ప్రతిభాపాటవాలను వెలికితీసే అవకాశం లాక్ డౌన్ ద్వారా వచ్చింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు వ్యాపారంలో అడుగుపెట్టారు. ఏ ఉద్యోగం లేని వారు ఉద్యోగం సంపాదించారు. కొందరు రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఇలా వారి పరిధి మేరకు తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసి.. ఇప్పుడు లక్షల్లో ఆర్జిస్తున్నారు. టెక్నాలజీ వినియోగం ఎక్కువైతే జీవితాలు నాశనం అవుతాయని అంటారు. కానీ అదే టెక్నాలజీ లాక్ డౌన్ లో ఎంతోమంది జీవితాలను నిలబెట్టింది.
లాక్ డౌన్ లో ఎటూ పోలేని పరిస్థితుల్లో.. ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి యూట్యూబ్ లో కోర్సులు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో గుంటూరుకి చెందిన రావూరి పూజిత ఒకరు. లాక్ డౌన్ లో యూట్యూబ్ వీడియోల ద్వారా కోర్స్ నేర్చుకుని.. గూగుల్ లో రూ. 60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఇంటర్ పూర్తి చేసిన పూజితకు.. జేఈఈలో ఝార్ఖండ్ బిట్స్ లో సీటు వస్తే తల్లిదండ్రులు అంత దూరం ఎందుకని అనడంతో.. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ లో చేరింది. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్సును ప్రవేశపెట్టారు. రెండో సెమిస్టర్ ముగిసే సమయానికి కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దీంతో ఇంటికే పరిమితమైంది పూజిత. అయితే ఆన్ లైన్ ద్వారా పాఠాలు వినేది.
ఏమైనా సందేహాలు ఉంటే అధ్యాపకులను గానీ, సీనియర్లను గానీ అడిగి తీర్చుకునేది. ఆన్ లైన్ లో అర్థం కాకపోతే యూట్యూబ్ లో వీడియోలు చూసి నేర్చుకునేది. అలా యూట్యూబ్ వీడియోల ద్వారా కోడింగ్ పై పట్టు సాధించింది. ఏ సాఫ్ట్ వేర్ కంపెనీ అయినా కోడింగ్ కి సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంది కాబట్టి.. కోడింగ్ పై పట్టు సాధించడం కోసం అనేక వెబ్ సైట్లని సందర్శించేది. ఆన్ లైన్ క్లాసులు అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో.. కోడింగ్ తో పాటు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుంది. తనకు తానే పరీక్ష పెట్టుకుని తన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునేది. లీట్ కోడ్, కోడ్ ఫ్రెష్, ప్రెప్ బైట్స్ వంటి వెబ్ సైట్లలో కోడింగ్, ఇతర అంశాలను నేర్చుకుంది. టైమ్ మేనేజ్మెంట్, ఆన్ లైన్ అసెస్మెంట్లు, ఇంటర్వ్యూలపై సాధన చేసింది. తరచూ మాక్ ఇంటర్వ్యూలకి హాజరయ్యేది. ఆన్ లైన్ లో సీనియర్లతో పరిచయం పెంచుకుని వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకునేది.
అవే ఇంటర్వ్యూలో ఆమెకు బాగా ఉపయోగపడ్డాయని పూజిత వెల్లడించింది. అలా గూగుల్, అమెజాన్, అడోబ్ కంపెనీల నుంచి కాల్ పొందగలిగానని వెల్లడించింది. అయితే అడోబ్, అమెజాన్ కంపెనీలు వార్షిక ప్యాకేజీ రూ. 45 లక్షలు ఆఫర్ చేస్తే.. గూగుల్ సంస్థ రూ. 60 లక్షల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసిందని, అందుకే గూగుల్ ఆఫర్ ని అంగీకరించినట్లు ఆమె వెల్లడించింది. త్వరలోనే ఇంటర్న్ షిప్ కు వెళ్తున్నానని ఆమె తెలిపింది. ఉద్యోగంలో గుర్తింపు, అనుభవం వచ్చాక ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించింది. అంతా లాక్ డౌన్ పుణ్యమే అని ఆమె తెలిపింది. మరి గుంటూరు నుంచి గూగుల్ వరకూ వెళ్లిన పూజితపై మీ అభిప్రాయమేమిటి? లాక్ డౌన్ సమయాన్ని కెరీర్ కోసం కేటాయించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.