మరణం ఎప్పుడు.. ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేం. దాని నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం బారిన పడటం మాత్రం ఖాయం. వయసు మళ్ళి మరణించేవారు కొందరైతే.. అనుకోని ప్రమాదాలతో అర్ధాంతరంగా తనువు చాలించేవారు మరికొందరు. అలానే, అర్ధరాత్రి అనుకోని దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూర్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేదా ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపైకి వెళ్లారా? అన్నది అంతుపట్టడం లేదు.
ఆత్మకూరు బస్టాండ్ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ నడుచుకొని వెళ్తుండగా, గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పురుషులు ఇద్దరూ రైలు పట్టాలపైనే మృతి చెందగా.. మహిళ బ్రిడ్జిపై నుంచి కిందపడి చనిపోయింది. ముగ్గురూ 45- 50 ఏళ్లలోపు వారే. పట్టాలపై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదం బారినపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మృతులకు చెందిన సంచులను ప్రమాదస్థలంలో గుర్తించన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంచుల్లో ఆధార్ కార్డులు, టీటీడీ లాకర్ అలాట్‌మెంట్ టికెట్లు దొరికాయి. వీటితో పాటు ఒక ఫోన్ నంబరు కూడా ఉందని తెలుస్తోంది. కానీ, ఫోన్ చేస్తుంటే ఎవరూ తీయట్లేరని సమాచారం. ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు విజయవాడకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు.రైలు విజయవాడ వైపు వెళుతుండటం.. గుర్తించిన ఆధారాల్లో విజయవాడ అని ఉండటంతో.. వీరు ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోకోణంలో ఇది ఆత్మహత్యనా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.