కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి కొన్ని కోట్ల మంది చనిపోయారు. కరోనాను కట్టడి చేయటానికి దేశదేశాలు లాక్డౌన్ విధించుకుని నాలుగు గోడల మధ్యా నలిగిపోయాయి. ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రెండు వేవ్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థే తీవ్రంగా దెబ్బతింది. ఇక, లాక్డౌన్ సమయంలో చాలా మంది కరోనా కారణంగా ప్రాణాలు పోతాయేమోనని భయంతో ఇంటికే పరిమితయ్యారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత స్వేచ్ఛగా బయట తిరగటం మొదలుపెట్టారు.
ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. కరోనా వైరస్‌కు భయపడి తల్లీకూతుళ్లు ఇద్దరు ఇంటికే పరిమితం అయ్యారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇంటినుంచి బయటకు రావటం లేదు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా, గాజులూరు మండలం, కుయ్యేరు గ్రామంలో మణి అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. నాలుగేళ్ల క్రితం కరోనా మొదలవ్వటంతో ఆ కుటుంబం ఇంటికే పరిమితం అయింది. కరోనా పరిస్థితులు సద్దు మణిగినా మణి, ఆమె కూతురు దుర్గా భవాని మాత్రం ఇంటి నుంచి బయటకు రాలేదు.
దీంతో మణి భర్త సూరిబాబు అన్ని సరుకులు తెస్తూ వారికి అన్న పానీయాలు అందించేవాడు. ఈ నేపథ్యంలోనే ఒక వారం రోజుల నుంచి వారు అతడ్ని కూడా దగ్గరకు రానివ్వటం లేదు. మణి ఆరోగ్యం బాగోలేకపోవటంతో అతడు గ్రామంలోని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి ఇద్దరికీ ఎంత నచ్చచెప్పినా వాళ్లు వినలేదు. ఓ గదిలో ఉండిపోయి, ఎవరైనా మాట్లాడితే దుప్పట్లోకి దూరిపోతున్నారు. భయంతో ఒణికిపోతున్నారు. చాలా సేపటి తర్వాత వాళ్లు తలుపులు తీయగా మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. తమకు ఎవరో చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు.